వచ్చే జనవరి 2వ తేదీ నుంచి రాష్ట్రంలో జూనియర్ కళాశాలలను తెరవాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. జేఈఈ మెయిన్ తేదీలు కూడా వెల్లడికావడంతో కనీసం మూడు నెలల తరగతి గది బోధన ఉండాలని అధికారులు భావించి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రయోగ పరీక్షల విషయంలో కొంత వెసులుబాటు ఇవ్వాలని, ప్రశ్నపత్రాల్లో కొంత ఛాయిస్ పెంచాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జేఈఈ మెయిన్ తేదీలు వెల్లడించిన నేపథ్యంలో ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ గురువారం అన్ని జిల్లాల ఇంటర్ విద్యాశాఖ అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ, హాజరుపై ఆరా తీశారు. ఈసారి పరీక్షల సందర్భంగా భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున కళాశాలల సందర్శించి తప్పనిసరిగా అవసరమైన వసతులపై నివేదిక ఇవ్వాలని ప్రాంతీయ ఇంటర్ విద్య అధికారులకు సూచించారు. డిగ్రీతో సంబంధం ఉన్న అంశాలను కచ్చితంగా ప్రాక్టికల్స్ చేయించాలని, మిగిలిన వాటిని తొలగించవచ్చన్న సూచనలు వచ్చినట్లు తెలిసింది.
తక్షణమే తెరవాలి