link roads in Hyderabad: రాజధానికి సమీపంలోని పది నగర/పురపాలక సంఘాల పరిధిలోని రోడ్లను హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)తో అనుసంధానం చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 104 కారిడార్ల నిర్మాణానికి రూ.2400 కోట్లు వ్యయం చేయడానికి శుక్రవారం పరిపాలనాపరమైన అనుమతి ఇస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన జీవోను శనివారం అధికారులు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల కొత్తగా చేపట్టే కారిడార్ల పరిధిలో అనేక లింకు రోడ్లను నిర్మించనున్నారు.
తీరనున్న ట్రాఫిక్ సమస్యలు..
జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రధాన మార్గాలకు చేరుకునేందుకు లింక్ రోడ్లు లేకపోవడంతో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. అనేక కాలనీల ప్రజలు నాలుగైదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి గమ్యస్థానం చేరాల్సి వస్తోంది. సమస్యను గుర్తించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. లింకు రోడ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. హైదరాబాద్ రోడ్ల అభివృద్ధి సంస్థ(హెచ్‌ఆర్‌డీసీఎల్) ఇప్పటికే రెండు దశల్లో 50 లింకు రోడ్లను నిర్మించింది. మూడో దశ కింద 104 రోడ్లను నిర్మించడానికి రూ.2400 కోట్లతో హెచ్‌ఆర్‌డీసీఎల్ ప్రతిపాదనలను రూపొందించి పురపాలక శాఖకు పంపించింది. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.1,500 కోట్లతో ఐదు ప్యాకేజీల కింద వెంటనే 50 కారిడార్లను నిర్మించమని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.