Hyderabad Road Development Corporation Limited: జీహెచ్ఎమ్సీ పరిధిలోని ప్రాంతాల మధ్యదూరం తగ్గించేందుకు, ప్రభుత్వం లింక్, స్లిప్ రోడ్లను నిర్మిస్తోంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా.. ఆయా ప్రాంతాల ప్రజలకు సులభతర రవాణా సౌకర్యం కల్పిస్తోంది. ప్రధాన కారిడార్‌లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లింక్ రోడ్ల ఉద్దేశం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, మొత్తం 126.20 కిలోమీటర్ల పొడవు కలిగిన 135 లింక్ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
అందులో భాగంగా, దాదాపు 572 కోట్లతో 52.36 కిలోమీటర్ల లింక్ రోడ్ల నిర్మాణాలు చేపట్టగా, 273 కోట్ల విలువైన 24 కిలోమీటర్ల పొడవైన పనులు పూర్తిచేశారు. అవి ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో 28.36 కిలోమీటర్ల, 298 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి. పూర్తైన లింక్ రోడ్ల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని మరో 104 రోడ్లునిర్మించాలని సర్కారు భావిస్తోంది.