ఇంటర్ పరీక్షల విషయమై చర్చించేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్... ఇవాళ ఇంటర్‌బోర్డు అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గతంలో ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఇంటర్ పరీక్షలు... మే 1 నుంచి ప్రారంభం కావాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దాదాపు 9.50 లక్షలమంది ఉన్నారు. ప్రతిరోజూ 4.75 లక్షలమంది వరకు పరీక్షలు రాయాల్సి ఉంది.
సీబీఎస్ఈ బాటలోనే రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల రద్దు!
పది తరగతి వార్షిక పరీక్షలను రద్దుచేసి, 12వ తరగతి పరీక్షలు వాయిదా వేసిన సీబీఎస్ఈ బాటలోనే... రాష్ట్రం కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి పరీక్షలు జరపకుండా... పరీక్ష ఫీజులు చెల్లించిన అందరిని పాస్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మేలో కరోనా తగ్గే సూచనలు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే... సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. మళ్లీ జూన్ 1న సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇవాళ నిర్వహించే సమావేశంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. అటు...కరోనా విజృంభణ దృష్ట్యా... పదో తరగతి పరీక్షలు రద్దు చేసే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు