రాష్ట్రంలో తొలి కేసు నమోదవడానికి ముందు నుంచీ ఆర్‌టీ- పీసీఆర్ పరీక్షలనే ఎక్కువగా నిర్వహిస్తున్నారు. గత మే, జూన్ నెలల్లో నమూనాల సంఖ్య విపరీతంగా పెరగడం.. ల్యాబుల్లో నిర్ధరణకు ఎక్కువ సమయం తీసుకోవడం.. ఫలితాల వెల్లడిలోనూ మూణ్నాలుగు రోజులు పడుతున్నందున.. గత నెల రోజులుగా రాష్ట్రంలో యాంటీజెన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సుమారు 20-21 వేల పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇందులో యాంటీజెన్ పరీక్షలే సుమారు 15-16 వేల వరకూ ఉంటున్నాయి. ప్రభుత్వ వైద్యంలో, ఓపీల్లో యాంటీజెన్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చి, కరోనా లక్షణాలున్న వారికి ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా.. ప్రైవేటు వైద్యంలో ఆసుపత్రిలో చేరినవారికి, ల్యాబులు, ఓపీకి వచ్చినవారికి ఎక్కువగా ఆర్‌టీ-పీసీఆర్‌నే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభుత్వ వైద్యంలో రోజుకు సుమారు రెండు వేల వరకూ, ప్రైవేటులో మూడు వేల వరకూ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలను చేస్తున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి.
అయితే సత్వర ఫలితాలను అందించడంలో యాంటీజెన్ పరీక్షలు విజయవంతమైనా.. ఆ ఫలిత పత్రాలను అందించడంలో మాత్రం అదే జాప్యం కొనసాగుతోంది. కొందరికైతే వారం, పది రోజులు గడిచినా ఫలిత సమాచారం అధికారికంగా అందడం లేదు. దీంతో ఇంట్లో ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న వారికి కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి సమస్య తీవ్రమైతే.. కొవిడ్ పాజిటివ్ ఫలిత పత్రం లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఆ పత్రం ఉంటే తప్ప ఆసుపత్రుల్లో చేర్చుకోకపోవడం వల్ల బాధితులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీనిపై పెద్దఎత్తున ఫిర్యాదులు అందడం వల్ల దిద్దుబాటు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
ప్రయోజనం ఇలా...
* ఫలిత పత్రం వెంటనే అందుబాటులో ఉండడం వల్ల.. ఒకవేళ పాజిటివ్‌గా నిర్ధరణ అయిన బాధితులకు ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరమొచ్చినా.. వారు నేరుగా వెళ్లిపోవడానికి మార్గం సుగమమవుతోంది.
* ముద్రిత పత్రం అవసరం లేకుండా మొబైల్ ఫోన్‌లో ఉన్న లింకు ద్వారా కూడా ఆసుపత్రిలో చేరిపోవచ్చు.
* నెగెటివ్ వచ్చినవారు ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా.. ఈ ఫలితం ఆధారంగా ఆటంకాల్లేకుండా సేవలు పొందవచ్చు.
* తప్పుడు ఫోన్ నంబరు ఇచ్చి, అధికారులను తప్పుదోవ పట్టించాలనుకునే వారి ఆటలు చెల్లవు.
* ప్రభుత్వ, ప్రైవేటులో ఎక్కడ, ఏ విధానంలో పరీక్షలు చేసినా.. అన్నీ కూడా ఆన్‌లైన్‌లో ఒకేచోట పొందుపరుస్తారు కాబట్టి.. ప్రభుత్వం వద్ద కొవిడ్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది.
* మున్ముందు రోజుకు 25-30వేల వరకూ పరీక్షలను ప్రభుత్వ వైద్యంలోనే నిర్వహించాలని యోచిస్తుండడం వల్ల సత్వర ఫలితాల వెల్లడికి ఇది దోహదపడుతుందని వైద్యశాఖ భావిస్తోంది.
* కొన్ని ప్రైవేటు ల్యాబుల్లో గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహిస్తూ.. సమాచారాన్ని ప్రభుత్వానికి తెలపడం లేదని అధికారులు గుర్తించారు. ఈ నూతన విధానం ద్వారా అటువంటి అక్రమాలను అడ్డుకోవచ్చు. పరీక్షల్లో పారదర్శకత పెంపొందించడానికి కూడా ఈ విధానం దోహదపడుతుందని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.