మూడు నెలలు అద్దె అడగొద్దు.. ఉత్తర్వులు జారీ - govenment on house rents
11:08 April 23
మూడు నెలలు అద్దె అడగొద్దు.. ఉత్తర్వులు జారీ
అద్దె ఇళ్లలో ఉండే వారి నుంచి మూడు నెలల పాటు అద్దె వసూలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలు చేసిన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయని... అద్దెలు వసూలు చేయవద్దని పురపాలక శాఖ స్పష్టం చేసింది.
మార్చి నుంచి మూడునెలల పాటు అద్దె వసూలు చేయవద్దని, అద్దె వసూలు చేయనందుకు ఎలాంటి వడ్డీ కూడా వసూలు చేయవద్దని తెలిపింది. బకాయిలను ఆ తర్వాత వాయిదాల్లో తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం అధికారాలు అప్పగించింది. అద్దెలు ఇవ్వని వారిని వేధించవద్దని, ఖాళీ చేయించరాదని ప్రభుత్వం తెలిపింది. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై అంటువ్యాధుల చట్టం 1897, విపత్తు నిర్వహణ చట్టం 2005లోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవీ చూడండి: ఈనాడు-ఈటీవీభారత్ 'కూలి'పోతున్నారు!' కథనానికి స్పందన