తెలంగాణ

telangana

ETV Bharat / state

grmb meeting: బోర్డు పరిధిలోకి పెద్దవాగు ప్రాజెక్టు: ఇరు రాష్ట్రాలు సుముఖత

గోదావరి బోర్డు పరిధిలోకి మొదటి దశలో పెద్దవాగు ప్రాజెక్టు ఒక్కటే వెళ్లనుంది. బోర్డు ప్రతిపాదనకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించగా నిర్వహణ బాధ్యతల అమలు ఇక లాంఛనమే కానుంది. సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో (grmb meeting) రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల అప్పగింతపై చర్చించారు.

grmb meeting
grmb meeting

By

Published : Oct 12, 2021, 5:23 AM IST

హైదరాబాద్‌లోని జలసౌధలో సోమవారం నిర్వహించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో (grmb meeting) రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల అప్పగింతపై చర్చించారు. గోదావరి బోర్డు పరిధిలోకి మొదటి దశలో పెద్దవాగు ప్రాజెక్టు ఒక్కటే వెళ్లనుంది. గోదావరి బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ (GRMB Chairman Chandrasekhar Iyer) అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, బోర్డు ఉప సంఘం కన్వీనర్‌ పాండే తదితరులు పాల్గొన్నారు. ఉపసంఘం అందజేసిన పలు ప్రాజెక్టుల నివేదికలు, ప్రతిపాదనలపై చర్చించారు. 14వ తేదీ నుంచి గెజిట్‌ అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రయోగాత్మక అమలులో భాగంగా మొదట పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు స్వీకరించనుంది. ఇక్కడ ఎదురయ్యే అనుభవాలను ఇతర ప్రాజెక్టుల్లో అన్వయం చేస్తామని బోర్డు తెలిపింది.


*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఏí,ˆ తెలంగాణలు 85:15 నిష్పత్తిలో నిర్వహణ వ్యయం భరించనున్నాయి. రెండు రాష్ట్రాల ఇంజినీర్లు, సిబ్బందిని కూడా అప్పగించనున్నారు. బోర్డు నిర్వహణకు ఏపీ రూ.8 కోట్లు (బీఆర్‌ఈ) కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రకటించలేదు. ప్రాజెక్టును బోర్డుకు అప్పగిస్తున్నట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది. విధుల నిర్వహణకు ఇంజినీర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది.

* సీలేరు జల విద్యుత్‌ ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ కోరింది. విద్యుత్‌ ఉత్పత్తిలో రాష్ట్ర వాటాపై అనేకసార్లు కేంద్రానికి సీఎం లేఖ రాసినా..ఇప్పటికీ తేల్చలేదని పేర్కొంది. బోర్డు పరిధిలోకి వస్తే విద్యుత్‌ పంపిణీ అంశం తేలుతుందని సూచించింది. దీనికి ఏపీ అభ్యంతరం తెలిపింది.

* గోదావరి నదికి దిగువ రాష్ట్రం ఏపీ. వరద లేని సమయంలో దిగువకు పెద్దగా నీటి ప్రవాహం రావడం లేదు. పెద్దవాగు ప్రాజెక్టు ఒక్కదానినే బోర్డు తీసుకుంటే పెద్దగా ఉపయోగం లేదని, ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులను చేర్చాలని ఏపీ పేర్కొంది. ఇతర ప్రాజెక్టులను చేర్చే అంశంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది.

* బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్లు కేటాయించాలనే అంశంపై చర్చ జరిగింది. బడ్జెట్‌ను ఏ అవసరాలకు వినియోగిస్తారనేది స్పష్టత ఇవ్వాలని రాష్ట్రాలు కోరాయి.. లేఖ రూపంలో ఆ సమాచారం తెలియజేయాలని బోర్డు ఛైర్మన్‌ సూచించారు.

పెద్దవాగు ఒక్కటే అయితే ఉపయోగం లేదు: ఏపీ

గోదావరి బోర్డు పరిధిలోకి పెద్దవాగు ప్రాజెక్టు ఒక్కటే చేర్చితే ఏపీకి ఉపయోగం లేదని ఆ రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు పేర్కొన్నారు. జీఆర్‌ఎంబీ సమావేశ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గోదావరిపై ఉన్న ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకోవాలని చెప్పాం. వరద లేని సమయంలో నీటిని తెలంగాణ చెరువులకు మళ్లిస్తుండటంతో నదిలో ప్రవాహం తగ్గిపోయి ఏపీలో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. నిరుడు సాగునీటికి ఇబ్బంది ఏర్పడి సీలేరు నుంచి విడుదల చేసుకోవాల్సి వచ్చింది. సీడ్‌ మనీ డిపాజిట్‌పై ప్రభుత్వంతో చర్చించాల్సి ఉందని చెప్పాం. కృష్ణా ప్రాజెక్టులతోపాటు, విద్యుత్‌ కేంద్రాలన్నీ కృష్ణా బోర్డులోకి చేర్చాలి. జూరాలను కూడా చేర్చాలని కోరుతున్నాం’’ అని అన్నారు.

సమస్యల పరిష్కార బాధ్యత కేంద్రానిదే: రజత్‌కుమార్‌

ప్రాజెక్టులకు సంబంధించిన అపరిష్కృత సమస్యల పరిష్కార బాధ్యత కేంద్రంపై ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ (Rajath Kumar Comments) తెలిపారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పుడు పెద్దవాగు ప్రాజెక్టు ఒక్కదానినే బోర్డు స్వీకరిస్తోంది. ప్రాజెక్టుల సమస్యలను తీర్చాలని సీఎం కేసీఆర్‌ అనేకసార్లు కోరారు. ఇటీవల కూడా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌ను కలిసి విన్నవించారు. గెజిట్‌ అమలు గడువు పొడిగించాలని రాష్ట్రం కోరుతోంది. ఏపీ కోరుతున్నట్లు మిగిలిన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం ఇప్పుడు సాధ్యపడదు. బోర్డుకు అప్పగించనున్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రకృతి వైపరీత్యాలు, వరదల నిర్వహణపై ఒక మ్యాపింగ్‌ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎవరు చేస్తారనేదానిపై స్పష్టత లేదు. పెద్దవాగుపై బోర్డు ప్రతిపాదనలను రాష్ట్రానికి పంపితే దానికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. గెజిట్‌ నోటిఫికేషన్‌లో ‘హ్యాండ్‌ ఓవర్‌’ అని ఒక పదం తప్పుగా వచ్చింది. ప్రాజెక్టులను మనం ఇవ్వడం లేదు. కేవలం నిర్వహణ బాధ్యతలే అప్పగిస్తున్నాం. సీడ్‌మనీ విషయంలో వారు అడుగుతున్న మొత్తం చాలా పెద్దది. ఆ డబ్బును ఆర్థికశాఖ విడుదల చేయడానికి పూర్తి స్థాయి వివరాలు అవసరం. 14వ తేదీ గెజిట్‌ అమలుకు గడువైనప్పటికీ సమయం పట్టే అవకాశాలున్నాయి. కేంద్రం కోరినట్లు నదీ జలాల్లో నీటివాటాపై సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన వ్యాజ్యాన్ని వెనక్కు తీసుకోవడం పూర్తయింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ -రజత్‌కుమార్‌, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.

ఇదీ చూడండి:GRMB meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

ABOUT THE AUTHOR

...view details