ఆగస్టు 3న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ కానుంది. హైదరాబాద్ జలసౌధలో సమన్వయ కమిటీ మొదటిసారి సమావేశం కానుంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్ జారీ చేసిన తర్వాత మొదటిసారి కమిటీ భేటీ అవుతుంది. గెజిట్ అమలు కార్యాచరణ ఖరారుపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. గోదావరి బోర్డు సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండీలు భేటీలో పాల్గొననున్నారు.
బోర్డుల పరిధిలో కార్యాచరణకు సై...
కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తెచ్చుకొనే ప్రక్రియకు బోర్డులు శ్రీకారం చుట్టాయి. నోటిఫికేషన్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి కార్యాచరణకు నడుం బిగించాయి. బోర్డు పరిధిలో ఉండే ప్రాజెక్టుల సిబ్బంది, కార్యాలయాలు, వాహనాలు, పరికరాలు మొదలైనవన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం, ప్రాజెక్టుల వద్ద అవసరాన్ని బట్టి కేంద్ర పోలీసు బలగాలను నియమించడం, సీడ్ మనీ కింద ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల వంతున చెల్లించడం తదితర అంశాలన్నింటిపై రెండు రాష్ట్రాలతోనూ బోర్డులు చర్చించనున్నాయి. గతంలో బోర్డు కమిటీల్లో ఉన్నవారినే కాక జెన్‌కో, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖలోని పరిపాలనా విభాగం అధికారులను కూడా కలిపి ప్రత్యేకంగా సమన్వయ కమిటీని ఏర్పాటుచేశాయి.
ఇదీ చూడండి:క్యారీ ఓవర్‌పై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం
అనుభవమున్న ఓ చీఫ్ ఇంజినీర్‌ను, సూపరింటెండెంట్ ఇంజినీర్‌ను సమన్వయం కోసం పంపాలని కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులను కోరింది. గోదావరి బోర్డు ఒకడుగు ముందుకేసి ఆగస్టు మూడో తేదీన సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో బోర్డులోని అధికారులతో పాటు కేంద్ర జల్‌శక్తి అధికారి, రెండు రాష్ట్రాల నీటిపారుదల, పరిపాలనా విభాగాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు, ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో సీఎండీ, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీలను ఆహ్వానించారు.