తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదారి ఉగ్ర రూపం... దిగువకు భారీగా నీరు విడుదల - ఉగ్ర గోదావరి

ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్​లోని ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వరదతో ధవళేశ్వరం ఎగువ, దిగువ ప్రాంతాలకు ముంపు భయం పొంచి ఉంది. ఇప్పటికే దేవీపట్నం పరిసర మండలాలలో వందల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వరద నీటిని సముద్రంలోనికి విడుదల చేయడం వలన... లంకగ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ఉద్ధృతి ఆదివారం కూడా కొనసాగొచ్చన సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

గోదారి ఉగ్ర రూపం... దిగువకు భారీగా నీరు విడుదల

By

Published : Sep 8, 2019, 2:21 PM IST

గోదారి ఉగ్ర రూపం... దిగువకు భారీగా నీరు విడుదల

గోదావరికి వరద ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రాజమహేంద్రవరం చేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 7 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు విడుదల చేశారు. వీటితో పాటు ఇంద్రావతి, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీ వరద చేరుతోంది. వరదతో భద్రాచలం వద్ద నీటిమట్టం 45 అడుగులకు చేరింది. ధవళ్వేవరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 10 అడుగులు చేరింది. వరద పెరగడం వలన డెల్టా కాల్వలకు 8700 క్యూసెక్కులు నీరు విడుదల చేశారు. ధవళేశ్వరం గేట్లు ఎత్తి 7 లక్షల 82 వేల పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

భారీగా పంట నష్టం

గోదావరి వరద పోటుతో దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాల్లోకి నీరు చేరడం వలన రాకపోకలు స్తంభించాయి. పడవల పైనే ప్రజలు ప్రయాణిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విలీన మండలాలు ఎటపాక, కూనవరం, వీఆర్​పురం మండలాల్లో పంట పొలాలు నీటమునిగాయి. మిరప, పత్తి, మొక్కజొన్న, వరి పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. చింతూరు, వీఆర్​ పురం మండలాలు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరదతో కోనసీమ గోదావరి పాయాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పి.గన్నవరం మండలంలో కకాలపాలం కాజ్​వే పైనుంచి వరదనీరు పారుతోంది. ఆదివారానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

భయం గుప్పిట్లో లంక గ్రామాలు

గోదావరికి వరద నీరు పెరుగుతున్న పరిస్థితుల్లో తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని లంక రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎగువ నుంచి వస్తోన్న వరదతో లంకగ్రామాలు భయం గుప్పిట్లో బతుకుతున్నాయి. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి నీటిని విడిచిపెట్టడం వలన కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం గౌతమి వంతెన వద్ద, గోపాలపురంలోని వశిష్ఠ వంతెనల వద్ద గోదావరి ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. వరదతో రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాలోని లంక పొలాలకు వరద ముంపు పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీచూడండి:'చంద్రయాన్​-2' ఆలస్యానికి ఆ ఉపగ్రహమే కారణం!

ABOUT THE AUTHOR

...view details