తెలంగాణ

telangana

ETV Bharat / state

Godarolla kitakitalu programme: సందడిగా 'గోదారోళ్ల కితకితలు'.. సభ్యుల ఆత్మీయ సమ్మేళనం - Rajahmahendravaram news

Godarolla kitakitalu programme: మాటల్లో వెటకారం.. మనసు నిండా మమకారం.. ఈ అలంకారాలు వినగానే మదిలో మెదిలేది గోదారోళ్లే. ఈ ప్రాంతం వాసులు నలుగురు ఒక చోట కలిస్తే.. అక్కడ నవ్వుల పండగే. అలాంటిది వేల మంది ఒకే చోట ఏకమైతే.. సంతోషాల సునామీనే. తమదైన యాస, సంప్రదాయాల్ని కాపాడుకునేందుకు ఏర్పాటైన గోదారోళ్ల కితకితలు బృంద ఆత్మీయ సమ్మేళనం సరికొత్త వినోదానికి వేదికైంది.

Godarolla kitakitalu programme
Godarolla kitakitalu programme

By

Published : Dec 6, 2021, 2:24 PM IST

సందడిగా 'గోదారోళ్ల కితకితలు'.. సభ్యుల ఆత్మీయ సమ్మేళనం

Godarolla kitakitalu programme: కల్మషం లేని స్వచ్ఛమైన మనుషులు, నోరూరించే కమ్మనైన వంటకాలు, చురుకైన చమక్కులకు చిరునామాగా నిలిచింది.. గోదారోళ్ల కితకితల 5వ ఆత్మీయ సమ్మేళనం. యువతీ యువకుల నేటి తరపు ముచ్చట్లు, నాటితరం నెమరువేసుకున్న ఆ పాత మధురాలు.. పండగ వాతావరణాన్ని తలపించాయి. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన ఆత్మీయులతో రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో జరిగిన ఈ కలయిక కన్నులపండువగా సాగింది.

కొవిడ్ కారణంగా గతేడాది ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడగా.. ఈ సారి గోదారోళ్ల కితకితలు ఫేస్‌బుక్ బృందం సభ్యులు కుటుంబాలతో హాజరయ్యారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆట పాటలతో సందడి చేశారు. ఈ గ్రూపు నిర్వాహకుడు ఈవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది ఆహ్లాదంగా గడిపారు.

ఆత్మీయ కలయికకు వచ్చిన పురుషుల్ని బావ అని, మహిళల్ని, అక్క, చెల్లి అని ప్రేమగా పిలుచుకుంటూ సందడి చేశారు. గోదావరి రుచులతో 40 రకాల వంటకాలతో ఆతిథ్యం ఏర్పాటు చేశారు. గోదావరి యాస, భాష, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించేందుకే ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి ఈ సమ్మేళనం కోసం ప్రత్యేకంగా వచ్చిన సభ్యులు.. మరిచిపోలేని మధురానుభూతులతో తిరుగు ప్రయాణమయ్యారు.

ఇదీ చదవండి:CS Meeting With Employees: విభజన ప్రక్రియ పూర్తయ్యేందుకు ప్రత్యేక కమిటీలు: సీఎస్

ABOUT THE AUTHOR

...view details