తెలంగాణ

telangana

ETV Bharat / state

బీచ్ రోడ్డుపై ని"బంధనాలు".. ఇక విశాఖలో వేడుకలు డౌెటే - జీవో నంబరు 1ఆర్‌కె బీచ్‌ రోడ్డు బోసిపోతుందా

RK BEACH ROAD: ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌ మార్గానికి ఎంతో పేరుంది. అత్యంత సుందరమైన ఈ మార్గానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. పర్యాటకులు ప్రత్యేకించి విశాఖపట్నంలోని ఆర్‌కె బీచ్‌ ప్రాంతానికి రాకుండా తిరిగి వెళ్లరు. అలాంటి చోట ఉదయం, సాయంత్రం వేళల్లో పలు కార్యక్రమాలు జరుగుతుంటాయి. జీవో నెంబర్​ 1 కారణంగా బీచ్ ​రోడ్డు రానున్న రోజుల్లో తన కళ కోల్పోతుందేమోననే చర్చ సాగుతోంది.

విశాఖపట్నం బీచ్
విశాఖపట్నం బీచ్

By

Published : Jan 11, 2023, 12:36 PM IST

RK BEACH ROAD: ఏపీలో విశాఖ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది ఆర్కే బీచ్​. ఎక్కువ శాతం మంది పర్యాటకులు దీనిని సందర్శించి కొద్దిసేపు సేద తీరుతారు. బీచ్​ ప్రదేశంలో ఉదయం, సాయంత్రం వేళల్లో పలు కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో నెంబర్​ 1 కారణంగా బీచ్​రోడ్డు రానున్న రోజుల్లో తన కళ కోల్పోతుందేమోననే చర్చ సాగుతోంది.

చర్చనీయాంశంగా జీవో నంబరు 1 పరిణామాలు:రాజకీయ పార్టీల సమావేశాలు, క్రీడా సంబరాలు, నడక పోటీలు, మారథాన్‌లు, ప్రజా ఉద్యమాలు, కార్మిక సంఘాల మహాసభలు, సినీ రంగంతో పాటు పలు సంస్థల వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే వేలాది మందికి తమ సందేశం చేరువవుతుందని విశ్వసిస్తారు. గత కొన్నేళ్లుగా సినిమా వేడుకలకు బీచ్‌రోడ్డు కేంద్ర బిందువుగా మారింది. చిన్న కార్యక్రమాలైతే బీచ్‌రోడ్డు పక్కన ఉన్న కొన్ని ఖాళీ స్థలాల్లో... పెద్దవైతే బీచ్‌లో నిర్వహిస్తూ వచ్చారు. అలాంటప్పుడు పోలీసులు చర్యలు చేపట్టి రాకపోకలు నిషేధించడం, ఒక్కోసారి పాక్షికంగా ఒక వరుసలో వాహనాలు అనుమతించండం చేసేవారు.

*రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబరు 1 కారణంగా బీచ్‌రోడ్డు రానున్న రోజుల్లో తన కళ కోల్పోతుందేమోననే చర్చ సాగుతోంది. వేదికలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించకూడదని పేర్కొనడంతో... నగరంలో తొలిసారి మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వేడుకపై ఆ ప్రభావం పడడం కూడా చర్చనీయాంశంగా మారింది. బీచ్‌రోడ్డులో సినిమా వేడుక నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించిన నిర్వాహకులు నగర పోలీసుల నిర్ణయం ఊహించలేదు.

*బీచ్‌రోడ్డులో వేదికను కొంత వరకు ఏర్పాటు చేసినప్పటికీ తరువాత దాన్ని ఎ.యు. ఇంజినీరింగ్‌ కళాశాల క్రీడామైదానానికి మార్చుకోవాల్సిందేనని పోలీసులు సూచించడంతో అలా చేయక తప్పలేదు. వాస్తవానికి నిర్వాహకులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఏయూ క్రీడామైదానానికీ దరఖాస్తు చేసుకోవడంతో కార్యక్రమం సజావుగా జరిగింది.

జాప్యంతో ఉత్కంఠ: పలు కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం అనుమతులకు వచ్చిన దరఖాస్తులపై ఒక్కోసారి పోలీసులు నిర్ణీత వ్యవధిలో ఏ నిర్ణయమూ వెల్లడించటం లేదు. ఆఖరు వరకు ఏదీ తేల్చకపోవడంతో నిర్వాహకుల్లో ఆందోళన కనిపిస్తోంది. ‘సిటిజన్‌ ఛార్టర్‌’ ప్రకారం ప్రతి దరఖాస్తుకు నిర్ణీత సమయం ఉన్నా కొందరు అధికారులు పాటించకపోవడం గమనార్హం. ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించే సాహసం చేయలేక పోలీసు అధికారుల అనుమతుల పత్రం వచ్చే వరకు తీవ్ర ఉత్కంఠతో గడుపుతున్నారు.

తీరానికి ఆకర్షణ ఎలా?: వాకథాన్‌, మారథాన్‌ కార్యక్రమాల్లో భాగంగా చిన్నపాటి వేదికలను నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవడం పరిపాటి. విజేతలకు బహుమతుల పంపిణీకి వీలుగా సభలు నిర్వహించడం అనివార్యం. తాజా జీవో కారణంగా రాబోయే రోజుల్లో అనుమతుల ప్రక్రియ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వివిధ కార్యక్రమాల నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తీరం ప్రాంతం కేంద్రంగా జరిగే పలు కార్యక్రమాలు నగర వాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న నేపథ్యంలో ఆంక్షల వల్ల అవి ఆగిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆయా సమావేశాల వల్ల ప్రజల భద్రతకు ఇబ్బంది లేదని, ట్రాఫిక్‌ పరమైన సమస్యలు ఉత్పన్నం కావని భావించినప్పుడే అనుమతులు ఇస్తాం. ప్రత్యేక పరిస్థితుల్లోనూ పరిశీలించి అవసరమైతేనే ఇస్తాం’ అని సీపీ శ్రీకాంత్‌ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details