హైదరాబాద్ మహానగర కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ 2021- 22 ఆర్థిక సంవత్సరానికి గాను 14 ఎజెండా అంశాలతో కూడిన ముసాయిదా బడ్జెట్‌ను ఆమోదించింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశమైంది.
పెన్షనర్లకు 2019 జులై 1 నుంచి ప్రభుత్వం పెంచిన కరువు భత్యం అమలు, జీహెచ్ఎంసీలోని అధికారులందరికి అధికారిక వినియోగ నిమిత్తం ఒకే నెంబర్ గల పోస్ట్ పెయిడ్ 4జీ డేటా సిమ్‌లను అందజేసే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. నాగోల్‌లోని ఫతుల్లగూడలో 6.20 ఎకరాల విస్తీర్ణంలో హిందు, ముస్లిం, క్రిస్టియన్లకు ఒక్కో వర్గానికి రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే శ్మశానవాటికలలో హిందు కమ్యునిటీకి ఎలక్ట్రికల్ క్రిమిటోరియం, క్రిస్టియన్, ముస్లిం కమ్యునిటీలకు శ్మశానవాటికల నిర్మాణానికి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
ఆస్తుల సేకరణకు ఆమోదం...
సెయింట్ ఆన్స్ పాఠశాల నుంచి ఎన్సీఎల్ ఎన్క్లేవ్ వరకు 18 మీటర్ల విస్తీర్ణంలో రోడ్డు వెడల్పునకు గాను 15 ఆస్తుల సేకరణకు స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. గాజులరామారం నుంచి మోడి ఎన్ క్లేవ్ మీదుగా శ్రీవెంకటేశ్వర అసోసియేషన్ వరకు 18 మీటర్ల మేరకు రోడ్డు విస్తరణకు 87 ఆస్తుల సేకరణకు అంగీకరించింది. తుకారం గేట్ గూడ్స్ ట్రాక్ నుంచి అడ్డగుడ్డ మీదుగా షహనాయ్ నర్సింగ్ హోం వరకు 18 మీటర్ల మేరకు రోడ్డు విస్తరణ సందర్భంగా 210 ఆస్తుల సేకరణకు ఆమోదం తెలిపారు.