దేశ వాణిజ్య రాజధాని ముంబయి తొలిదశ కరోనా ధాటికి అల్లాడినా... రెండో దశవ్యాప్తిలో మాత్రం ఎదిరించి నిలబడింది. మొదట్లో కేసులు భారీగా నమోదైనా... స్వల్ప కాలంలోనే అదుపులోకి తెచ్చింది. వైరస్‌పై పోరులో బృహన్ ముంబయి మహానగర పాలక సంస్థ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ విశిష్ఠమైన కృషి చేశారు. గతేడాది మే నెలలో నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే సమయంలో ముంబయిలో కరోనా ఉద్ధృతంగా ఉంది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నా... కేసులు విపరీతంగా నమోదయ్యాయి. చెత్త కుండీల్లో మృతదేహాలు, రోడ్లపైన అనాథశవాలతో భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. మరోవైపు నగరంలో ఫేస్‌మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు, ఆక్సిజన్ ఇలా ప్రతిదీ సమస్యే. ఈ పరిస్థితుల నుంచి ముంబయిని గట్టెక్కించడానికి చాహల్ ఎంతో ప్రణాళికా బద్ధంగా శ్రమించారు.
కట్టడి ప్రణాళిక
వికేంద్రీకృత పోరాటంతోనే కరోనా విజయం సాధ్యమని భావించిన ఆయన... కేంద్ర మార్గదర్శకాలకనుగుణంగా రక్షణ రంగంలో అనుభవమున్న మరో ఇద్దరితో కలిసి తన ప్రణాళికను అమలు చేశారు. టెస్టులు చేసిన ల్యాబులు రిపోర్టులను నేరుగా బాధితులకు పంపకుండా... బీఎంసీ కంట్రోల్ రూంకు పంపుతాయి. వీటి ఆధారంగా రోజుకు ఎన్ని కేసులు నమోదవుతున్నాయనే కచ్చితమైన నివేదిక అందేది. నేరుగా వచ్చిన సమాచారంతో ప్రజలు కూడా భయాందోళనకు గురికాకుండా చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి సకాలంలో వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా నగరంలో 24గంటలు పనిచేసేలా... 24 వార్‌రూంలు నెలకొల్పారు. ఒక్కో వార్ రూంలో 30 టెలిఫోన్లు, 10 మంది ఆపరేటర్లు, 10 మంది వైద్యులు, 10 మంది సహాయక సిబ్బంది, 10అంబులెన్స్‌లు నిత్యం అందుబాటులో ఉంటాయి. ప్రతి వార్‌రూం పరిధిలో ఇంకో 10 డాష్‌బోర్డులు చొప్పున ఏర్పాటు చేసి... పరిస్థితిని పర్యవేక్షిస్తుంటారు.
సకాలంలో వైద్యసేవలు
ముంబయి నగరంలో దాదాపు 55 టెస్టింగ్ ల్యాబ్‌లు ఉండగా... వీటి నుంచి రోజుకు 10వేల వరకు రిపోర్టులు వస్తుంటాయి. బీఎంసీ కేంద్ర కార్యాలయంలోని కంట్రోల్ రూం సిబ్బంది... వార్‌రూంల వారీగా వేరు చేసి ఉదయం 6 గంటల కల్లా సంబంధిత వ్యక్తులకు సమాచారమిస్తారు. వైద్యసిబ్బంది నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షిస్తారు. ఒక వేళ అత్యవసరమైతే వాళ్లే దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్తారు. దీంతో ఆస్పత్రుల వద్ద రద్దీ అనూహ్యంగా తగ్గిపోయింది. పూర్తిగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పడకల కేటాయింపు జరుగుతున్నందువల్ల ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండాపోయింది. ఈ ప్రణాళికను అమలు చేయడానికి భారీ స్థాయిలో వైద్య సిబ్బంది అవసరమైంది. దీంతో వార్ రూమ్‌లలో పని చేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన వైద్యులను నియమించాలని నగర కమిషనర్ నిర్ణయించారు. నెలకు 50వేలతో పాటు వీరికి వార్‌రూంకు దగ్గర్లోనే వసతి సదుపాయం కల్పించేలా... 900 మంది డాక్టర్లను, 600 మంది నర్సులను నియమించారు. దాదాపు 800 కొత్త అంబులెన్స్‌లను, ప్రత్యేక శిక్షణ కలిగిన డ్రైవర్లను యుద్ధప్రాతిపదికన నియమించారు. అవసరమైన చోట్ల ఉబర్ సేవలను కూడా వినియోగించుకునేందుకు ఆ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు.