తెలంగాణ

telangana

ETV Bharat / state

గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పార్టీల అడుగులు - ghmc elections latest news

నామపత్రాల ఘట్టం పూర్తయింది. అభ్యర్థుల జాబితా దాదాపుగా కొలిక్కివచ్చింది. ప్రచార గడువు దగ్గరపడుతోంది. పార్టీ ఏదైనా అభ్యర్థి ఎవరైనా అందరి గమ్యం గ్రేటర్‌ పీఠమే. వ్యూహప్రతివ్యూహాలు... ఎత్తుకు పైఎత్తులు. సమయం తక్కువున్నా తగ్గేదే లేదంటూ... అస్త్రశస్త్రాలు సంధిస్తూ... నేతలు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఓ వైపు ప్రత్యర్థిని దెబ్బతీసే వ్యూహాలు... మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునే హామీలు... ఇలా హోరాహోరి పోరుతో నగరరాజకీయం రసవత్తరంగా మారింది.

ghmc elections
ghmc elections

By

Published : Nov 22, 2020, 10:26 PM IST

బల్దియా పోరులో పీఠం నీదా నాదా అంటూ తేల్చుకునేందుకు రాజకీయ పార్టీలు కదనరంగంలోకి దుకాయి. అభ్యర్థిత్వాలు, నామపత్రాల ఘట్టం పూర్తవటంతో అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సన్నద్ధమయ్యాయి. సమయం తక్కువగా ఉండటంతో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ప్రధాన పార్టీలు... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమదైన అస్త్రాలతో ప్రచారం సాగిస్తున్నాయి. అభివృద్ధే ప్రధాన ఎజెండాగా అధికార పార్టీ ముందుకు సాగుతుండగా... ప్రభుత్వ వైఫల్యాలపై విపక్షాలు దృష్టి సారిస్తూ... ఓట్లు అడుగుతున్నాయి.

గత ఫలితాలకు మించి

గ్రేటర్‌ ఎన్నికల్లో మొదటి నుంచి అందరికంటే ఒకడుగు ముందున్న అధికార పార్టీ... ప్రచారంలోనూ జోరును కొనసాగిస్తోంది. నెలల తరబడిగా గులాబీ శ్రేణులను సన్నద్ధం చేయటం మొదలు... ప్రచారంలో అంతిమంగా జరిగే అధినేత సభ వరకు చేపట్టాల్సిన ప్రతీ కార్యక్రమాన్నీ వ్యూహాత్మకంగా అమలుచేసేలా... ప్రణాళికలు రూపొందించింది. ప్రత్యేక రాష్ట్రంలో బల్దియాకు మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో ఏకపక్షంగా 99సీట్లను సాధించి... గులాబీ జెండాను ఎగురవేసిన తెరాస... ఈ సారి దానిని మించిన ఫలితాన్ని రాబట్టేలా వ్యూహాలు పన్నుతోంది. విపక్షాలు ఇంకా అభ్యర్థిత్వాల ఖరారులోనే ఉంటే... తెరాస ప్రచారంలో దూసుకుపోతోంది. దుబ్బాక ఎన్నికలతో విజయోత్సాహంలో ఉన్న కమలం దూకుడుకు కళ్లెం వేసేలా బల్దియా పోరును సరైన వేదికగా భావిస్తోంది.

ప్రగతి మంత్రం

అభ్యర్థిత్వాలు, నామపత్రాల దాఖలు పూర్తైనందున... తెరాస నుంచి బరిలోకి దిగిన వారంతా క్షేత్రస్థాయిలో ప్రచారం సాగిస్తున్నారు. 11 మంది మంత్రులు సహా... ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లతోపాటు నగర శివారులోని మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లను డివిజన్లవారీగా ఇంఛార్జీలుగా నియమించింది. వీరంతా.. ఆయా ప్రాంతాల్లో శ్రేణులను సమన్వయం చేయటంతో పాటు సమావేశాలతో అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్… సైతం రోడ్‌షోలతో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రగతి మంత్రంతో ప్రజల్లోకి వెళ్తున్న నేతలు... హైదరాబాద్‌కు ఆరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. భాజపా విధానాలను, విపత్తువేళ రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరించిన తీరును ఎండగడుతోంది.

జాతీయ నేతలతో భాజపా

ఇక తెరాసకు ప్రత్యామ్నాయం తామేనంటూ... వరుస విజయాలతో ఊపుమీదున్న కమలం పార్టీ... గ్రేటర్‌ ఎన్నికల్లోనూ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది. బలమైన అభ్యర్థుల కోసం చివరిదాకా వేచిచూసే ధోరణిని ప్రదర్శించిన భాజపా... ఇతర పార్టీల్లోని అసంతృప్తులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పలువురిని తమవైపు తిప్పుకోవటంలో సఫలీకృతమైంది. అభ్యర్థులే కాకుండా నగరంలోని బలమైన నేతలతోనూ మంతనాలు సాగిస్తూ... కాషాయకండువా కప్పేందుకు కసరత్తులు చేస్తోంది. నామపత్రాల దాఖలు ముగిసినందున... ప్రచారంలో కారు జోరుకు తగ్గకుండా ముందుకు సాగుతున్న కమలం పార్టీ... తెరాస చేసిందేమీ లేదంటూ వైఫల్యాల్ని ఎత్తిచూపుతోంది. ఇప్పటికే బండి సంజయ్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ ప్రచారం సాగిస్తుండగా... పలువురు జాతీయ నేతలను సైతం భాజపా రంగంలోకి దింపనుంది.

ప్రచారంలో హస్తం వెనుకడుగు

నాయకత్వలోపం, వరుస వలసలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌... గ్రేటర్‌ ఎన్నికల్లో ఆది నుంచి గడ్డుపరిస్థితులనే ఎదుర్కొంటోంది. బల్దియా తొలినాళ్లలో మేయర్‌ పదవిని కైవసం చేసుకున్న ఆ పార్టీ... ప్రస్తుతం బలమైన అభ్యర్థులను పోటీకి దించలేని స్థితికి చేరింది. పార్టీ పరిస్థితితో పలువురు ఇప్పటికే ఇతర పార్టీల్లోకి వలసలు వెళ్లగా... చాలా డివిజన్లలో సరైన అభ్యర్థులే కరవయ్యారు. నామినేషన్ల దాఖలు గడువు ముగిసినందున... అన్ని పార్టీలు ప్రచారాన్ని షురూ చేసినా... కాంగ్రెస్‌ మాత్రం జోరును ప్రదర్శించలేకపోతోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తదితరులు మాత్రమే అక్కడక్కడ అభ్యర్థులతో కలిసి ప్రచారాలు చేస్తున్నారు. పార్టీని వీడుతున్న సీనియర్లతో చర్చలు జరిపేందుకే నాయకత్వం పరిమితమవుతోంది. పార్టీ నియమించిన పలువురు సమన్వయకర్తలు సైతం ప్రచారంపై ఆసక్తి కనబర్చటంలేదు. దీంతో చాలాచోట్ల అభ్యర్థులు నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఓటు బ్యాంకుతోనే

ఇక సొంత ఓటు బ్యాంకునే నమ్ముకున్న మజ్లిస్‌... దాదాపు సిట్టింగ్‌లకే సీట్లిచ్చినందున ముందుగానే ప్రచారం ప్రారంభించింది. గతం కంటే ఎక్కువ స్థానాల్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ ... ఈ సారి యాభైకి పైగా డివిజన్లలో అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. సిట్టింగ్ కార్పొరేటర్ల పనితీరు, వారి వయసును పరిగణనలోకి తీసుకుని ఐదుగురు సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించి... కొందరిని ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో కాకుండా వేరే చోట్ల అభ్యర్థులుగా నిలిపింది. ఇప్పటికే ఖరారైన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధినేతలు అసదుద్దీన్ ఒవైసీతో పాటు అక్బరుద్దీన్‌ పాదయాత్రలతోపాటు బహిరంగ సభలకు ప్రణాళిక రూపొందించారు. ఉదయం వేళల్లో అసదుద్దీన్ ఒవైసీ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చే విధంగా పాదయాత్ర చేపట్టాలని భావిస్తుండగా.. సాయంత్రం వేళల్లో ద్విచక్రవాహన ర్యాలీలు, అక్బరుద్దీన్ ఒవైసీతో బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.

ఇదీ చదవండి :భాజపాపై 132 కోట్ల ఛార్జిషీట్లు వేయాలి: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details