తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏర్పాట్లు పూర్తి.. మొదటి ఫలితం వెలువడేది అక్కడే! - జీహెచ్​ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 30 సర్కిళ్ల పరిధిలోని డీఆర్సీ కేంద్రాల్లో డివిజన్​కు ఒకటి చొప్పున 150 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాలులో 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ghmc
ghmc

By

Published : Dec 3, 2020, 6:53 PM IST

గ్రేటర్ తీర్పు రేపు వేలువడనుంది. బల్దియాలో బరిలో నిలిచిన 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 7 గంటల సమయంలో పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూంల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్స్​కు తీసుకొస్తారు.

ఇలా లెక్కిస్తారు

మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలైన ఓట్లను బాక్సుల్లో నుంచి తీసి 25 బ్యాలెట్ల చొప్పున బండిల్‌గా కడతారు. ఇదే సమయంలో ఆ కేంద్రంలో పోలైన ఓట్లకు సమానంగా ఉన్నాయా.. లేదా అన్నది పరిశీలిస్తారు. వార్డు పరిధిలోని అన్ని ఓట్లను బండిళ్లుగా కట్టి.. ఓ డ్రమ్ములో వేసి కలుపుతారు. ఏ పోలింగ్‌ కేంద్రంలో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలు తెలియకూడదనే ఇలా చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి రెండు నుంచి రెండున్నర గంటలు పట్టే అవకాశముంది. ఆ తర్వాతే లెక్కింపు మొదలవుతుంది.

11గంటల తర్వాతే

11 గంటల తర్వాతే మొదటి రౌండ్‌ వివరాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రౌండ్ల వారీగా ఓట్లను లెక్కిస్తారు. గుర్తు ఆధారంగా ఓట్లను ఒక్కో డబ్బాలో వేస్తారు. అనంతరం వాటిని లెక్కించి ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయన్నది తేలుస్తారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఉండే ఏజెంట్లు కోరితే మరోసారి ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌, అడిషనల్‌ కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు ఉంటారు. వార్డు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. రిటర్నింగ్‌ అధికారి వద్ద, అభ్యర్థితోపాటు ఒక కౌంటింగ్‌ ఏజెంట్‌ ఉండే అవకాశం ఉంటుంది. ఇతర ఏజెంట్లు పక్కన ఉండి లెక్కింపును పరిశీలించవచ్చు.

మొదట మెహిదీపట్నంలో..

గ్రేటర్​లో అత్యంత తక్కువగా 11,818 ఓట్లు పోలైన మెహిదీపట్నం వార్డు ఫలితం మొదట వెలువడే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్‌కు 14 వేల ఓట్లు లెక్కించే అవకాశం ఉండగా, అంతకంటే తక్కువ ఓట్లున్న ఈ డివిజన్‌ ఫలితం త్వరగా రానుంది. గ్రేటర్‌లోని మెజార్టీ వార్డుల్లో 15 నుంచి 27 వేల వరకు ఓట్లు పోలైన నేపథ్యంలో రెండు రౌండ్లలో అత్యధికంగా 136 డివిజన్​లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. 28 వేల కంటే ఎక్కువ ఓట్లు పోలైన 12 వార్డుల్లో మూడు రౌండ్ల కౌంటింగ్‌ జరుగుతుంది.

మైలార్​దేవ్​పల్లిలో ఆలస్యంగా

అత్యధికంగా 37,445 ఓట్లు పోలైన మైలార్‌దేవ్‌పల్లి ఫలితం ఆలస్యంగా వెలువడే అవకాశముంది. దీంతోపాటు సుభాష్​నగర్‌ 33,1910, గాజుల రామారం 32,999, అల్లాపూర్‌ 30,485, బన్సీలాల్‌పేట 29,670, తార్నాక 29,490, సీతాఫల్‌మండి 29,443, రెహ్మత్ నగర్ 29,130, అంబర్ పేట్ 28,763, కొండాపూర్ 28,746, ఉప్పల్ 28,190, ఓల్డ్ బోయిన్ పల్లి 28,019 ఈ వార్డుల్లో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదీ చదవండి :గ్రేటర్​ ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details