ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటున్న దేశాల్లో జర్మనీ ఒకటి. మొదట్లో కేసులు ఎక్కువగా నమోదైనా.. ధైర్యంగా వైరస్‌ను నియంత్రించడం వల్ల ఆ దేశం ముందంజలో నిలుస్తోంది. జర్మనీలో ఏప్రిల్ 14 నాటికి 1.3 లక్షల కేసులు నమోదైతే అందులో సగం మంది కోలుకున్నారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు, వైద్యవిధానాలు, ప్రజాచైతన్యం కారణంగానే కరోనా కట్టడి అవుతోందని జర్మనీకి చెందిన వైద్యనిపుణురాలు డాక్టర్ మరియ చెన్నమనేని తెలిపారు. వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేశ్ సతీమణి అయిన ఆమె జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని ప్రసిద్ధ ఆసుపత్రి క్లినికమ్ బుచ్‌లో సీనియర్ ఫిజియోథెరపిస్ట్‌గా 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. జర్మనీలో కరోనా నియంత్రణ తీరు.. వైద్యవిధానాలు, ప్రభుత్వ చర్యలపై ‘ఈనాడు’కు ఫోన్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
- కరోనాతో అతలాకుతలమైన దేశాల్లో జర్మనీ ఒకటి. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి..?
ఈఏడాది జనవరి 27న జర్మనీలో మొదటి కేసును గుర్తించారు. స్టార్న్‌బెర్గ్‌లోని జర్మన్ కార్ల విడిభాగాల సరఫరాదారు వెబ్‌స్టాకు చెందిన 33 ఏళ్ల ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. వుహాన్‌కి చెందిన ఒక చైనా సహోద్యోగి ద్వారా అతనికి వ్యాపించినట్లు గుర్తించారు. ఇటలీ, ఇరాన్, చైనాల నుంచి వచ్చిన వారిద్వారా దేశంలో విస్తరించింది. బుధవారం నాటికి సుమారు 1,32,210 కేసులు 3,495 మరణాలు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత ఉన్నా ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లింది. గుర్తించు, పరీక్షించు, చికిత్సనందించు (ట్రేస్, టెస్ట్, ట్రీట్) విధానం విజయవంతమైంది. పరీక్షల కారణంగా ప్రారంభ రోగ నిర్ధారణ, ఇది రోగి పరిస్థితి క్షీణించక ముందే ప్రారంభ చికిత్సను చేపట్టడం జర్మనీ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి రేటు గణనీయంగా తగ్గింది. 64,300 మంది కోలుకున్నారు. కరోనా మొదట్లో సగటున ఒకరిద్వారా.. 5 నుంచి ఏడుగురి వరకు వ్యాపించింది. ప్రస్తుతం అది 1.2నుంచి 1.5మంది వరకు తగ్గింది. ప్రస్తుతం 2294 మంది ఐసీయూలో ఉండగా 73 శాతం మంది వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్నారు.
- వైరస్‌ను ఎలా కట్టడి చేశారు
జర్మన్ వ్యాధి, అంటువ్యాధుల సంస్థకు చెందిన రాబర్ట్ కోచ్ ద్వారా కరోనా నివారణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. పెద్దఎత్తున వ్యాధి నియంత్రణ (కంటెయిన్‌మెంట్) సమూహాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక చర్యలు తీసుకుంది. మార్చి 22న జాతీయ కర్ఫ్యూ విధించింది. అయిదు ఇరుగు పొరుగు దేశాలకు సరిహద్దులు మూసివేసింది. అత్యవసరాల కోసమే ప్రజలు బయటికి వెళ్లడానికి అనుమతించింది. జర్మనీలో 132 కేంద్రాల్లో వారానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వైరస్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 13.5 లక్షల పరీక్షలు జరిగాయి. వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. టెలీ మెడిసన్‌ను అందుబాటులోకి తెచ్చారు.
- జర్మనీ వైద్యవిధానాలు ఎలా ఉన్నాయి