Telangana Budget Sessions 2023-24 : బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌పై నేడు శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్ పై చర్చ చేపడతారు.
Telangana Assembly Sessions 2023-24: ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, గడ్డం రుద్రమదేవికి శాసనసభ సంతాపం ప్రకటించనుంది. కౌన్సిల్‌లో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ చేపడతారు. మన ఊరు - మన బడి, జంటనగరాల్లో సీసీటీవీ కెమేరాలు, ధాన్యం సేకరణ కేంద్రాలు, ట్రాఫిక్ నిర్వహణ, ఆసరా ఫించన్లు, నకిలీ విత్తనాలు - ఎరువులు తదితర అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్సీలు వెలిచాల జగపతిరావు, జస్టిస్ ఎ. సీతారామ రెడ్డికి కౌన్సిల్ సంతాపం తెలపనుంది.
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యకలాపాల సలహా మండలి నిర్ణయాలు తీసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం శాసనసభలో తెలిపారు. ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర శాసనసభలో హరీశ్‌రావు, మండలిలో ప్రశాంత్‌రెడ్డిలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న శాసనసభకు సెలవు. తిరిగి ఇవాళ సభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. దానికి రాష్ట్ర ఆర్థికమంత్రి సమాధానం చెబుతారు. 9, 10, 11 తేదీల్లో పద్దులపై చర్చ ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు ప్రశ్నోత్తరాలను సైతం నిర్వహిస్తారు. 12న ఆదివారం ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. దానికి సభ ఆమోదం తెలపనుంది. అంతటితో సమావేశాలు ముగుస్తాయి.