Police caught Ganja Gang in Hyderabad :రాష్ట్రంలో భారీగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. పోలీసులకు చిక్కకుండా వాహన రిజిస్ట్రేషన్ నంబరు ప్లేటును మారుస్తూ..గంజాయి రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకొని.. అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్‌లోని ఆరుగురు నిందితుల నుంచి 200 కిలోల గంజాయి, రెండు కార్లు, ఆరు ఫోన్లు, రెండు నకిలీ నంబరు ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాచకొండ సీపీ చౌహాన్ వెల్లడించారు.
పుణె, షోలాపూర్‌కు చెందిన ఓ ముఠా.. చిన్నతనం నుంచే చెడు వ్యసనాలు, గంజాయికి బానిసైందని రాచకొండ సీపీ డీసీ చౌహాన్ తెలిపారు. మహారాష్ట్రలో గంజాయికి డిమాండ్ ఉందని గ్రహించే.. వీరంతా సిండికేట్‌గా ఏర్పడి కమీషన్ల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు నుంచి గంజాయి తరలించేవారని పేర్కొన్నారు. సీలేరులో స్మగ్లరు కేశవ్ వద్ద కిలో రూ.2000 లేదా రూ.3000లకు కొని మహారాష్ట్రలోని దత్తా అనే వ్యక్తికి రూ.20,000 చొప్పున అమ్ముతుండేవారని వివరించారు.
పోలీసులకు వాహన నంబర్లు చిక్కకుండా.. నిందితులు తాము ప్రయాణించే కారు నంబరును తరచూ మార్చేవారని సీపీ చౌహాన్ వెల్లడించారు. ఇటీవల దత్తా ఆర్డర్ చేయడంతో సీలేరు నుంచి 200 కిలోల గంజాయి తరలించారని తెలిపారు. ఇలా ఏపీ నుంచి గంజాయిని తరలిస్తూ.. తెలంగాణ బోర్డర్‌లోని ప్రవేశించారని.. అయితే ఇక్కడే వారికి ఇక్కట్లు ప్రారంభమయ్యాయన్నారు.