తెలంగాణ

telangana

ETV Bharat / state

'యాసంగి ధాన్యం ఒక్క గింజ వదులుకోం.. ఒక్క రూపాయి పోనివ్వం' - పౌర సరఫరా శాఖపై గంగుల సమీక్ష

Gangula Kamalakar Review On Yasangi Paddy: ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రి గంగుల కమలాకర్​ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, సేకరణ, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణా కట్టడికి కట్టుదిట్టమైన టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేస్తామన్నారు.

gangula kamalakar
gangula kamalakar

By

Published : Apr 7, 2023, 8:23 PM IST

Updated : Apr 7, 2023, 9:05 PM IST

Gangula Kamalakar Review On Yasangi Paddy: ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజ వదులుకోబోం.. ఒక్క రూపాయి పోనివ్వమని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పౌరసరఫరాల శాఖ కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అక్రమాలకు పాల్పడుతున్న, డిఫాల్ట్ మిల్లర్లు అధికంగా ఉన్న సూర్యాపేట, నల్గొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పటిష్టమైన టాస్క్‌ఫోర్స్ బృందాలు తక్షణమే ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మిగతా అన్ని జిల్లాల్లో విశ్రాంత పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో కట్టుదిట్టమైన టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నాని తెలిపారు.

ధాన్యం అమ్ముకునే మిల్లర్లు, రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు సైతం రివార్డులు అందజేయడంతోపాటు వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పెరిగిందని ప్రస్తావించారు. ఆరింతలుగా పెరిగిన ఈ ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెరగలేదని... కేవలం గతానికి ఇప్పటికీ 2 రెట్లు మాత్రమే పెరిగిన నేపథ్యంలో మిల్లర్లకు అదనంగా ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని తెలిపారు.

Gangula Kamalakar Review Meeting: ఇదే అదనుగా కొన్ని చోట్ల మిల్లర్లు అనైతిక చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి 125 శాతం క్యాష్ రికవరీ సైతం వసూలు చేస్తున్నామని హెచ్చరించారు. డిఫాల్ట్ మిల్లర్లు, అక్రమార్కులను ఉపేక్షించేది లేదని ఈ విషయంలో ఎలాంటి పక్షపాతం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి 90 శాతం రికవరీ చేశామని, మిగతా 10 శాతం సైతం శరవేగంగా రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.

ఇందు కోసం క్షేత్రస్థాయి పౌరసరఫరాల యంత్రాంగంతోపాటు కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రికవరీలో వేగం సాధిస్తున్నారని అన్నారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో జరిగిన బియ్యం అక్రమాలు సైతం విజిలెన్స్ బృందాలే పసిగట్టిన దృష్ట్యా.. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అక్రమాలను అరికట్టడానికి రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందాలు స్థానిక యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 7, 2023, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details