దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని.. రాష్ట్ర ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. ఇప్పటికే 23 సంస్థలను ప్రైవేటీకరణ చేసిన మోదీ ప్రభుత్వం.. మరో 100 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం' - ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని రాష్ట్ర ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వెల్లడించారు.
ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకుని తీరుతామన్నారు. అవసరమైతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఏకం చేసి.. మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను ఎత్తివేసేందుకే.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. హిందూ, శ్రీరామ్ పేరుతో భాజపా ప్రజలను మోసం చేస్తుందన్నారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ రెండు కలిసి దేశాన్ని పరిపాలన చేస్తున్నాయని ఆక్షేపించారు.
ఇదీ చూడండి :'బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి రూ. 10వేల కోట్లు కేటాయించాలి'