తెలంగాణ

telangana

ETV Bharat / state

వికేంద్రీకరణ దిశగా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్

పండ్ల రైతులకు శుభవార్త. దక్షిణాదిలో అతి పెద్దదైన హైదరాబాద్ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ వికేంద్రీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సామాజిక దూరం పాటించాలన్న నిబంధనల మేరకు బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి పండ్ల విక్రయాలను కొత్తపేట రైతుబజారు వెనక వైపుకు తరలిస్తున్నారు. కోహెడ వద్దకు మామిడి విక్రయాలు చేపట్టేందుకు మార్కెటింగ్ శాఖ యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది.

gaddiannaram fruit market shifting
వికేంద్రీకరణ దిశగా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్

By

Published : Apr 3, 2020, 7:17 AM IST

హైదరాబాద్ నగర నడిబొడ్డున గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ యార్డు వికేంద్రీకరణపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పుట్నుంచో ఈ పండ్ల మార్కెట్‌ యార్డును నగర శివారు కోహెడకు తరలించాలన్న ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. నిత్యం రైతులు, వర్తకులు, కమీషన్ ఏజెంట్లు, చిరు వ్యాపారులు, డ్రైవర్లు, క్లీనర్లు, హమాలీలతో అత్యంత రద్దీగా ఉంటూ కళకళలాడే ఈ మార్కెట్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా చూపుతోంది. సామాజిక దూరం పాటించాలన్న లక్ష్యానికి అన్ని స్థాయిల్లో తిలోదకాలిస్తున్నట్లు ఫిర్యాదులు రావడం వల్ల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. రద్దీ, సామాజిక దూరం, ప్రత్యామ్నాయాలపై సమీక్షించారు. బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి అమ్మకాలు... గడ్డిఅన్నారం నుంచి కొత్తపేట రైతుబజారు వెనుక ఉన్న 11 ఎకరాల్లో తాత్కాలిక మార్కెట్ నెలకొల్పాన్న మంత్రి ఆదేశాల మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. విక్టోరియా మెమోరియల్ సంస్థకు చెందిన ఆ ఖాళీ స్థలంలో నేల చదును చేస్తున్నారు.

సర్కారు ఉత్తర్వులు

రంగారెడ్డి జిల్లా కోహెడ వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ, యార్డు ఏర్పాటుకు నోటిఫై చేస్తూ ఇటీవల సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అబ్ధుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడలో ఏర్పాటు ప్రతిపాదన ఎప్పట్నుంచో ప్రభుత్వం పరిశీలనలో ఉంది. మొత్తం 178.09 ఎకరాల విస్తీర్ణం నోటిఫై అయింది. తాజా పరిణామాలతో గడ్డిఅన్నారం ఏఎంసీ, యార్డు తరలించేందుకు మార్గం సుగమమైంది. అందుకోసం తక్షణ అవసరాల కోసం ప్రభుత్వం 40 లక్షల రూపాయలు కేటాయించింది.

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో ఆసక్తిగల కమీషన్ ఏజెంట్ల నుంచి మార్కెటింగ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. గత కొంత కాలంగా వ్యాపార లావాదేవీల ఆధారంగా తమ స్థాయిని బట్టి వ్యాపారులకు కోహెడలో అర ఎకరం నుంచి ఎకరం చొప్పున స్థలం కేటాయించనుంది. ఆ స్థలంలో రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక వసతులు కల్పిస్తుంది. రైతులే సొంతంగా తమ షెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ నాటికి ఇది కార్యరూపం దాల్చనుంది.

వికేంద్రీకరణ దిశగా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్

ఇవీ చూడండి: లాక్​డౌన్​తో పడిపోయిన బత్తాయి ధర

ABOUT THE AUTHOR

...view details