తెలంగాణ

telangana

ETV Bharat / state

సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి రూ.7,350 కోట్లు - తెలంగాణలో సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి నిధులు

Financial Assistance for House construction in Telangana : తెలంగాణలో సొంత జాగాలో డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర సర్కార్ ఆర్థిక సాయం అందిస్తానని అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దీనికోసం సర్కార్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,350 కోట్లు కేటాయించింది. అలాగే వచ్చేఏడాదికి డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం కింద గృహాల నిర్మాణానికి చర్యలు వేగవంతం తెలిపింది.

House construction
House construction

By

Published : Feb 11, 2023, 9:33 AM IST

Financial Assistance for House construction in Telangana : రాష్ట్రంలో సొంత స్థలాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,350 కోట్లు కేటాయించింది. కుటుంబానికి రూ.3 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. అలాగే వచ్చేఏడాదికి డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం కింద గృహాల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయనున్నట్లు ప్రభుత్వం శాసనసభకు వెల్లడించింది.

ప్రభుత్వం ఇంతవరకు 2.75 లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేయగా దాదాపు 1.37లక్షల గృహాల నిర్మాణం పూర్తయింది. మరో 53,984 ఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తికాగా మిగతావి నిర్మాణదశలో ఉన్నాయి. లబ్ధిదారుల వాటా లేకుండా ప్రభుత్వమే పూర్తి నిధులు వెచ్చించి చేస్తున్న నిర్మాణాలు వేగంగా పూర్తిచేసి అందించనున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈమేరకు లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించేందుకు సాంకేతిక సాయాన్ని తీసుకోనున్నామని, ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గృహనిర్మాణాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారు దరఖాస్తుదారుల్లో ఉంటే వారిని తొలగించి, ఏ పథకం కింద లబ్ధి పొందనివారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది.

సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి ప్రభుత్వం 2023-24లో 4 లక్షల మంది వరకు లబ్ధిదారులకు సాయం అందించనుంది. ఈమేరకు పట్టణ ప్రాంతాల్లో 2,21,800 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 1,78,200 మందికి ఆర్థికసాయం అందించడానికి నిర్ణయించింది. కరోనా తదితర కారణాలతో రెండేళ్లుగా గృహనిర్మాణాలు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి పీఎంజీఎస్‌వై గ్రామీణ, పట్టణ, డబుల్‌ బెడ్‌రూమ్‌, సొంత జాగాల్లో గృహాల పథకం కింద మొత్తం 5.35 లక్షల ఇళ్లకు లక్ష్యం పెట్టుకుంది.

‘డబుల్‌’ వేగానికి చర్యలు..డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. జిల్లాస్థాయిలో కలెక్టర్లకు బాధ్యతలు ఇవ్వడంతో పాటు రూ.150 కోట్ల వరకు పరిపాలన మంజూరు అధికారాన్ని అప్పగించింది. ఈ పథకం కోసం బస్తా సిమెంటు రూ.230కే ఇచ్చేలా ఇప్పటికే సిమెంటు కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో గుత్తేదారులు ఎక్కువమంది పాల్గొనేందుకు వీలుగా ఈఎండీ మొత్తాన్ని 2.5 శాతం నుంచి ఒక శాతానికి, ఎఫ్‌ఎస్‌డీ మొత్తాన్ని 7.5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది.

అలాగే లబ్ధిదారుల ఎంపిక కోసం మంత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలతో జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, ఈ కమిటీకి కన్వీనర్‌గా కలెక్టరును నియమించింది. గ్రామస్థాయిలో దరఖాస్తులు తీసుకుని గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేస్తోంది. గ్రామసభలు ఆమోదించిన లబ్ధిదారుల జాబితాలను తహశీల్దార్లు కలెక్టర్లకు పంపితే ఆ జాబితాలకు షెడ్యూలు ప్రకారం లాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జీహెచ్‌ఎంసీకి వెలుపల చేపట్టిన ఇళ్లలో నియోజకవర్గానికి 10% లేదా వెయ్యి ఇళ్లు ఇందులో ఏది తక్కువైతే ఆ మొత్తంలో స్థానిక లబ్ధిదారులకు రిజర్వ్‌ చేస్తారు.

రాష్ట్రంలో సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం.. నియోజకవర్గంలో 2వేల మందికి ₹3లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు శాసనసభలో ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కోటాలో మరో 25వేల మందికి ఆర్థికసాయం చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.63లక్షల మందికి ₹7,890 కోట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details