Free Screening Of NTR Movies : వెండితెర కథానాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు. సినిమా నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా సినిమా రంగంపై ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. ఆయనకు సొంతంగా సినిమా థియేటర్లు కూడా ఉండేవి. వాటిలో ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలోని రామకృష్ణ థియేటర్ ఒకటి. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెనాలిలో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ఏడాదిపాటు ప్రదర్శించాలని నిర్ణయించారు. ఆ సినిమాల ప్రదర్శనకు పెమ్మసాని థియేటర్‌ను ఎంచుకున్నారు. సినిమాలు చూసేందుకు వస్తున్న ప్రేక్షకుల్ని చూస్తుంటే ఎన్టీఆర్పై అభిమానం ఇప్పటికీ తగ్గలేదనిపిస్తోందని చెబుతున్నారు.
"ఎన్టీఆర్ నటించిన మంచి సినిమాలన్నింటికీ ప్రతి ఆటకి రోజు 400 మందికి తగ్గకుండా వస్తున్నారు. మా థియేటర్ కెపాసిటీ 470 అయితే ప్రతిరోజు 300 మందికి పైగా వస్తున్నారు. డ్రైవర్ రాముడు, వేటగాడు.. ఇలా మరి కొన్ని సినిమాలకు చాలా మంది జనాలు చూడడానికి వచ్చి.. థియేటర్లో స్థలం లేకుండా ఉండటంతో 200 మంది తిరిగి ఇంటికి వెళ్లారు"-పెమ్మసాని పోతురాజు, థియేటర్ యజమాని