Young Liu wrote a letter to CM KCR: రాష్ట్రంలో తయారీ కేంద్రం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు ఫాక్స్‌కాన్ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ ఛైర్మన్ యాంగ్ లియూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. తనకు, తన బృందానికి మంచి ఆతిథ్యం ఇచ్చారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత గ్రీటింగ్ కార్డుతో తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ ఆలోచనలు, ప్రణాళికలు తనలో స్ఫూర్తి నింపాయన్నారు. భారతదేశంలో తనకు కొత్త మిత్రుడు లభించారని, భవిష్యత్‌లో కలిసి పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు యాంగ్ లియూ పేర్కొన్నారు. ఈ నెల రెండో తేదీన సమావేశంలో చెప్పినట్లుగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తయారీ కేంద్రం ఏర్పాటుకు ఫాక్స్‌కాన్ కట్టుబడి ఉందని లేఖలో స్పష్టం చేశారు. కొంగరకలాన్ పార్కులో కార్యకలాపాలు త్వరగా ప్రారంభించేలా తమ బృందానికి రాష్ట్ర సహకారం కావాలని కోరారు. తైవాన్‌లో పర్యటించాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానించిన యాంగ్ లియూ... తైపీలో ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో గౌరవంగా ఉంటుందని అన్నారు. ఈ విషయంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పంధించారు. భారీ పెట్టుబడి కోసం రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్, యాంగ్ లియూకు ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఫాక్స్‌కాన్ పెట్టుబడిపై వచ్చిన సందేహాలకు యాంగ్ లియూ లేఖే సమాధానమన్నారు.