తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈసారి ఖైరతాబాద్ బడా​ గణేశ్ ఎత్తెంత? ఏ రూపంలో దర్శనమిస్తాడో తెలుసా? - khairatabad ganesh 2021 news

భాగ్యనగరంలో ప్రముఖ కట్టడాల తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచింది ఖైరతాబాద్​ గణేశ్​. 65 ఏళ్ల పాటు ప్రతి ఏటా విభిన్న అవతారాల్లో ఒక్కో అడుగు పెరుగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు. సహజ రంగులతో పర్యావరణ హితంగా విగ్రహం నిర్మాణం సాగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నగరానికి తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుంటారు. కానీ గతేడాది కొవిడ్​ మహమ్మారి కారణంగా వినాయకుడి ఎత్తు తగ్గించారు. కరోనా నిబంధనలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు అనుమతివ్వలేదు. ఈ సారి 40 అడుగుల ఎత్తుతో పంచముఖ రుద్రమహాగణపతిగా గణపయ్యను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠిస్తున్నారు.

khairatabad  ganesh
ఖైరతాబాద్​ గణేశ్

By

Published : Jul 17, 2021, 5:26 PM IST

Updated : Jul 17, 2021, 6:50 PM IST

ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణనాథుడు ఈసారి 40 అడుగుల ఎత్తుతో కొలువుదీరనున్నాడు. ఈ మేరకు ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ విగ్రహ నమూనాను ఆవిష్కరించింది. ఈసారి పంచముఖ రుద్రమహాగణపతిగా ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఎడమవైపున కాలానాగదేవత, కుడివైపు కాల విష్ణు విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. గణనాథుడికి ఇరువైపులా కృష్ణ కాళీ, కాళ నాగేశ్వరి మూర్తుల విగ్రహాలు ఉంచనున్నట్లు ఉత్సవకమిటీ వెల్లడించింది. కొవిడ్ నేపథ్యంలో గతేడాది 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శిల్పి రాజేంద్రన్​ ఆధ్వర్యంలో 40 అడుగుల పంచముఖ రుద్రమహాగణపతి విగ్రహం రూపుదిద్దుకోనుంది.

కొవిడ్ నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడి.. దర్శనార్థం ఖైరతాబాద్ రావొద్దని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ganapathideva.org వెబ్​సైట్​ ద్వారా ఈసారి ఆన్​లైన్​ దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.

నిబంధనలు పాటిస్తూ

సెప్టెంబర్‌ 10 నుంచి వినాయక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని గణేశ్​ ఉత్సవ కమిటీ తెలిపింది. 19న నిమజ్జనం ఉంటుందని వెల్లడించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వేడుకలు చేసుకోవాలని సూచించింది. గతేడాది మాదిరిగానే నిమజ్జన సమయంలో అందరూ భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేసింది.

1954లో ఒక్క అడుగుతో గణేశుడు

1954లో స్వాతంత్ర్య సమరయోధుడు సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఖైరతాబాద్​లో ఒక్క అడుగుతో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ ఒక్కో రూపంలో ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిస్తున్నాడు. 2019లో 65 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చాడు. శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో గణేశుడి విగ్రహాన్ని భారీ ఎత్తున తీర్చిదిద్ది.. 11 రోజులపాటు అంగరంగవైభవంగా పూజలు నిర్వహించేవారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా గతేడాది గణనాథుడు 18 అడుగులకే పరిమితమయ్యాడు. ఈసారైనా అధిక ఎత్తులో విగ్రహం ప్రతిష్ఠించి.. అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ కరోనా రెండో దశ విజృంభణ ఇప్పుడిప్పుడే తగ్గడంతో.. ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 40 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. గణేష్​ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు కొనసాగనుంది.

ఇదీ చదవండి:Vinayak chaturthi 2021: సెప్టెంబర్‌ 10 నుంచి గణేశ్​ ఉత్సవాలు..

Last Updated : Jul 17, 2021, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details