Formula E race car competitions Tickets: హుస్సేన్‌సాగర్ తీరాన రయ్.. రయ్.. అంటూ రేస్ కార్ల సందడి మరోసారి మొదలుకానుంది. వచ్చే నెల 11వ తేదీ నుంచి ఫార్ములా ఈ రేసింగ్ ఉంటుందని నిర్వహకులు ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు టికెట్లు జారీ చేశారు. వెయ్యి రూపాయాలు నుంచి పది వేల రూపాయల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. రూ.1000లకు గ్రాండ్‌స్టాండ్, రూ. 3,500లు చార్జ్ గ్రాండ్‌స్టాండ్, రూ.6000లకు ప్రీమియం గ్రాండ్‌స్టాండ్, రూ.10వేలకు ఏసీ గ్రాండ్‌స్టాండ్ టికెట్లు లభిస్తాయని తెలిపారు.
మొత్తం 11 దేశాలకు చెందిన 22 మంది ఈసారి పోటీల్లో పాల్గొంటారని నిర్వహకులు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన రేసింగ్ ప్రాక్టీస్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్.. దేశంలో టాప్ 25 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.
గత అనుభవాలతో సరికొత్త పాఠాలు: గత సంవత్సరం జరిగిన ఇండియాన్ కార్ రేసింగ్ ప్రాక్టీస్ పోటీలు ఇప్పడు నిర్వాహకులకు సరికొత్త అనుభవాలు నేర్పిందని అనుకోవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలో కేటీఆర్ ప్రత్యేక చొరవతో మొదటిసారిగా నిర్వహించిన ఈ కార్ రేసింగ్ మొదటి నుంచి పెద్ద సవాల్‌గా మారింది. హైదరాబాద్ రోడ్డులో ఇలాంటి రేసింగ్‌లు సక్రమంగా జరుగుతాయా అనే సందేహాలు అనేక మందికి వచ్చాయి. ఇందు కోసం ప్రత్యేకంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 2.7 కి.మీల స్ట్రీట్ సర్క్యూట్ తయారుచేశారు. దీనిపై వాహనదారులు, విపక్షపార్టీల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. రేసింగ్ పేరుతో రోడ్లు పాడుచేస్తున్నారని మండిపడ్డారు.