ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోడు భూముల సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని అఖిల భారత రైతు - కూలీ సంఘం డిమాండ్ చేసింది. అటవీ హక్కుల చట్టం - 2006లో పేర్కొన్న 13 రకాల హక్కులు అమలు చేయడం ద్వారా గిరిజన, ఆదివాసీ రైతులకు.... పోడు భూములపై హక్కలు కల్పిస్తూ పట్టాలు జారీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో రైతుల ఉద్యమాలు, నాసిక్ - ముంబయి మహా పాదయాత్ర తరహాలో గత పోరాటాలు స్ఫూర్తిగా తీసుకుని పోడు భూముల రక్షణ కోసం ఐక్య ఉద్యమాలే శరణ్యమని నిర్ణయించింది.
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పోడు భూముల వివాదాల కారణంగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత గిరిజన సదస్సు జరిగింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి జయశంకర్ తదితర జిల్లాల నుంచి పోడు భూముల రైతులు తరలివచ్చారు.
పోడు భూములు, ఆదివాసీలపై అటవీ శాఖ, పోలీసుల వేధింపులు, నిర్బంధాలు, క్రిమినల్ కేసులు, ఇతర అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. గిరిజన గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తానని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్... తక్షణమే చర్యలకు ఉపక్రమించాలని వారు విజ్ఞప్తి చేశారు.