Interim Bail to Lakshmi Narayana: విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయనకు.. హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇవాళ విచారణ హాజరుకావాలని.. ఈనెల 10న ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.
లక్ష్మీనారాయణపై సీఐడీ కేసు.. ఇంట్లో సోదాలు
CID raids on Lakshmi Narayana house: ఆంధ్రప్రదేశ్ నైఫుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై.. ఏపీ సీఐడీ అధికారులు.. లక్ష్మీనారాయణతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో ఈనెల 10న సోదాలు చేశారు. చంద్రబాబు హయాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ సోదాలు చేశారు. ఈనెల 9న హైదరాబాద్‌కు చేరుకున్న సీఐడీ అధికారులు.. సోదాల కోసం జూబ్లీహిల్స్ స్టేషన్‌లో పోలీసు సిబ్బంది సాయాన్ని కోరారు. ఇతర వివరాలు కావాలని పోలీసులు అడగ్గా.. సోదాలు ఎక్కడ చేయాలన్న సమాచారం సీల్డ్ కవర్‌లో అందాకే అందించగలమని చెప్పి సీఐడీ సిబ్బంది వెళ్లిపోయారు.
retired IAS officer lakshmi narayana sick:అనంతరం ఈనెల 10న ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్ పోలీసుల సాయం తీసుకోకుండానే.. డీఎస్పీ ధనుంజయుడు, సీఐ జీవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలోని దాదాపు పదిమంది.. జూబ్లీహిల్స్ నవనిర్మాణ నగర్‌లో ఫ్లాట్ నంబర్ 108లోని విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంటికి చేరుకుంది. సీఐడీ అధికారులు లోపలికి రాకుండా లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబీకులు అడ్డుకున్నారు. నోటీసులు, వారెంట్ లేకుండా అనుమతించబోమన్నారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం జరిగింది. సంబంధింత పత్రాలు చూపాక.. లక్ష్మీనారాయణ వారిని అనుమతించారు. ఈ క్రమంలోనే సీఐడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని లక్ష్మీనారాయణ ఇంట్లోని పనిమనుషులు ఆరోపించారు. సోదాల్లో భాగంగా హార్డ్ డిస్కు, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు సోదాలు చేస్తుండగా మరికొందరు లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన ఉద్వేగానికి గురై ఒక్కసారిగా కింద పడిపోయారు. కుటుంబ వైద్యుడికి ఫోన్ చేయగా.. ఆయన వచ్చి పరిశీలించి రక్తపోటు పెరిగినట్టు గుర్తించారు. కొన్ని వైద్యపరీక్షలు, ప్రాథమిక చికిత్స చేశారు. ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించినా ఏపీ సీఐడీ అధికారులు అందుకు అంగీకరించలేదు. ఇంట్లోనే వైద్యం అందించాలన్నారు. గతంలో 2 శస్త్రచికిత్సలు జరగడం, రక్తపోటు పెరగటంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్య బృందం స్పష్టం చేసింది. కుటుంబసభ్యులూ సీఐడీ అధికారులను నిలదీశారు. చివరకు వారు అంగీకరించడంతో ఆయనను బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే ఉంచి చికిత్స చేస్తున్నారు.