కల్తీ నివారణకు తెలంగాణ బ్రాండ్ ఉత్పత్తులు
మొత్తం 8 రకాల ఆహారోత్పత్తులు తొలి ఏడాదే ఉత్పత్తి చేయాలని ఉద్యాన సంస్థ నిర్ణయించింది. రోజుకు 13 టన్నుల చొప్పున ఏడాదికి 3,250 టన్నులు ఉత్పత్తిచేసి చిల్లర మార్కెట్‌లో వినియోగదారులకు విక్రయించాలనేది లక్ష్యంగా నిర్దేశించింది. నిత్యావసరాలైన పసుపు, కారం పొడి, ధనియాల పొడి వంటి ఉత్పత్తులు తయారు చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేయాలి. ఇవి మార్కెట్‌లోకి వస్తే ప్రైవేటు సంస్థలు విక్రయించే ఉత్పత్తుల నాణ్యత, ధరలో పోటీతత్వం ఏర్పడి కల్తీలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.
మైసూర్‌లోని కేంద్ర ఆహార సాంకేతిక పరిజ్ఞాన పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్‌ఐ) ఈ ప్లాంట్ ఏర్పాటుకు అధునాతన సాంకేతికతతో "సమగ్ర ప్రాజెక్టు నివేదిక - డీపీఆర్"ను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఏడాదిన్నర క్రితం వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం సీఎఫ్‌టీఆర్‌ఐలో అధ్యయనం చేసి వచ్చింది.
అభివృద్ధికి 18 నెలల గడవు.. ఆరుమాసాలైనా కదలని పనులు
మేడ్చల్ జిల్లా దూలపల్లిలో 16.56 ఎకరాల విస్తీర్ణం స్థలాన్ని ఈ సంస్థకు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక బాగుందని కేంద్రం సైతం ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమంలో భాగగా ప్రత్యేకంగా 4.28 కోట్ల రూపాయలను గ్రాంట్‌గా గత జులై మాసంలో మంజూరు చేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల్లోగా నిధులు ఇచ్చి ఖర్చు చేస్తేనే ఈ నిధులు ఇస్తామని షరతు విధించింది. ఇప్పటికే ఆరు మాసాలైనా రాష్ట్రం నిధులు కేటాయించక పోవడం వల్ల కేంద్ర నిధులూ వెనక్కిపోయే ప్రమాదం ఏర్పడింది.