Fish canteens in Telangana: రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ మత్స్య రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఉచితంగా చేప, రొయ్య పిల్లలను అందజేస్తుండటంతో ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. మత్స్య శాఖ స్వయం సమృద్ధి లక్ష్యంగా తాజాగా హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ మత్స్య భవన్ పక్కన 'తెలంగాణ చేపలు' పేరిట ఓ రెస్టారెంట్‌ను తెరిచింది. ఫిష్ స్టాల్‌తోపాటు రెస్టారెంట్‌లో చేపలు, రొయ్యల కూరలు, బిర్యానీ, ఇతర రుచికరమైన వంటకాలు ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ఫిష్ క్యాంటీన్ ప్రత్యేకత: సాధారణంగా చికెన్ బిర్యానీకి ధీటుగా మాసబ్‌ట్యాంకు ఫిష్ బిర్యానీ బాగా ఫ్యేమస్ అని ముంబయి, దిల్లీ కూడా పార్శిల్స్ తీసుకెళతారని మత్స్యకార మహిళలు అంటున్నారు. ఆరోగ్యం దృష్ట్యా కూరల్లో శుద్ధి చేసిన నెయ్యి, బిర్యానీలో కుంకుమ పువ్వు, అప్పటికప్పుడు ఫ్రెష్‌గా అల్లం, వెల్లుల్లి అదనపు విలువ జోడించి తయారు చేస్తున్న ఈ వంటకాలన్నీ మన ఇంట్లో చేసుకున్నట్లే చక్కటి రుచికరంగా ఉండటం ఓ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.
అన్ని ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో ఫిష్ క్యాంటీన్లు: రాష్ట్రంలో ప్రభుత్వం నీలి విప్లవం దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నది. మత్స్యకారులు, మహిళా స్వయం సహాయక బృందాలు, యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. మత్స్య శాఖ ఈ ఏడాది దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. మార్కెటింగ్ అవకాశాల కల్పనలో భాగంగా అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్‌స్టేషన్లలో ఫిష్ క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో సంప్రదింపులు జరుపుతోంది.