Vande Bharat Express in Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. దురంతో రైలు కంటే వేగంగా పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య నడుస్తున్న రైళ్లలో అత్యంత వేగంగా వెళ్లేది దురంతోనే. వారానికి మూడు రోజులు నడిచే ఈ రైలు 10.10 గంటల్లో గమ్యం చేరుకుంటోంది. కాగా, వందేభారత్ ప్రయాణ సమయం 8.40 గంటలుగా రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. అంటే దురంతో రైలు కంటే గంటన్నర ముందుగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరుకుంటుంది. రోజూ నడిచే ఇతర రైళ్లతో పోలిస్తే వందేభారత్‌లో దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. గరీబ్‌రథ్ 11.10, ఫలక్‌నుమా 11.25, గోదావరి 12.05, ఈస్ట్‌కోస్ట్ 12.40, జన్మభూమికి 12.45 గంటల సమయం పడుతోంది.
ఛార్జీలు ఎంతంటే?:
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ వేళలు, ఛార్జీల వివరాల్ని రైల్వేశాఖ ప్రకటించాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి 699 కి.మీ దూరం. దిల్లీ.. జమ్మూలోని కట్రా మధ్య వందేభారత్ నడుస్తోంది. ఈ రెండింటి మధ్య దూరం 655 కి.మీ దూరం.ఛార్జీల్ని పరిశీలిస్తే- ఛైర్‌కార్ టికెట్ ధర రూ.1,665. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ధర రూ.3,055. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య దూరం ఇంకాస్త ఎక్కువే కావడంతో దిల్లీ-కాట్రా వందేభారత్ ఛార్జీల కంటే కొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఈనెల 19న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నప్పటికీ ఆ రోజు ప్రయాణికులను అనుమతించరు. ఈరైలు ఎప్పటినుంచి ప్రయాణికులకు అందుబాట్లోకి వస్తుందన్నది రైల్వే శాఖ ప్రకటించాల్సి ఉంది.