తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాక్సినేషన్ సక్సెస్... కిష్టమ్మకు తొలిటీకా - హైదరాబాద్​లో కరోనా వ్యాక్సినేషన్​

కొవిడ్‌ మహమ్మారిని తుదముట్టించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌... తొలి రోజు విజయవంతమైంది. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ సహా ఇతర ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేశారు. కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కో కేంద్రంలో 30మంది చొప్పున వ్యాక్సినేషన్‌ చేశారు. గవర్నర్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రక్రియను ప్రారంభించి భరోసా నింపారు.

hyderabad corona vaccination
hyderabad corona vaccination

By

Published : Jan 16, 2021, 7:26 PM IST

Updated : Jan 16, 2021, 9:34 PM IST

హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గాంధీ ఆసుపత్రిలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి వ్యాక్సిన్‌ను కిష్టమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలికి వేయించారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి, టిమ్స్ డైరెక్టర్ విమల థామస్, ఐపీఎం డైరెక్టర్ శంకర్ సహా 33 మందికి గాంధీ ఆసుపత్రిలో వ్యాక్సిన్ ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, ఇతర ఉన్నతాధికారులు ప్రక్రియను పర్యవేక్షించారు.

అందరికీ టీకా..

వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని... ఇది అత్యంత సురక్షితమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. టీకా కోసం తొందరపడొద్దని.. ప్రాధాన్య క్రమంలో అందరికీ ఇస్తామని తెలిపారు.

సేవలకు కృతజ్ఞతగా...

ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా మన దేశం కొవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసుకోవటం ప్రజలందరికీ గర్వకారణమని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన గవర్నర్‌.. కరోనా యోధులు అందించిన సేవలకు కృతజ్ఞతగా తొలిటీకా వేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో హైదరాబాద్‌ వాక్సిన్‌ హబ్‌గా ఉండడం అందరికీ గర్వకారణమని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. తిలక్‌నగర్‌ పీహెచ్​సీలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకంలో అందరికీ టీకా అందుతుందని స్పష్టం చేశారు.

షాపూర్​నగర్​లో మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ జిల్లా షాపూర్‌నగర్‌ పీహెచ్​సీలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కోఠి ఈఎన్​టీ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రాజాసింగ్, మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల, ఎర్రగడ్డ చెస్ట్‌ ఆసుపత్రిలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. కుషాయిగూడ ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, మల్కాజిగిరి పీహెచ్​సీలో ఎమ్మెల్యే మైనంపల్లి... కొవిడ్‌ టీకాలు వేసే కార్యక్రమానికి ప్రారంభించారు. కొండాపూర్ జిల్లా ఆసుపత్రి, కాప్రా, కీసర ఆసుపత్రుల్లో 30 మంది చొప్పున టీకాలు వేశారు.

ఇవీ చదవండి :

కిష్టమ్మ చెప్పిన తొలి టీకా ముచ్చట!

'వ్యాక్సినేషన్ విజయవంతం... సీఎం కృషి అభినందనీయం'

Last Updated : Jan 16, 2021, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details