Fire Accidents in Hyderabad : హైదరాబాద్ బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన(Bazarghat Fire accident Incident) తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఏకంగా తొమ్మిది ప్రాణాలు బలి కావడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపింది. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో అక్రమంగా రసాయనాల్ని నిల్వ చేస్తున్నట్లు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రసాయన గోదాముల నిర్వహణకు స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ అనుమతి పొందిన ప్రాంతంలో కాకుండా వేరేచోట్ల అక్రమంగా గోదాములు నిర్వహిస్తున్నట్లు.. ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడుతున్నాయి. వాస్తవానికి జనావాసాల్లో ఇలాంటి రసాయనాల్ని నిల్వ ఉంచడం నిషేధం. హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డు లోపల రెడ్, ఆరెంజ్ విభాగంలోని సుమారు 1350 పరిశ్రమల్ని వెలుపలికి తరలించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా.. పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
Last Three Years Fire Accidents in Telangana: రసాయనాలు లేదా ఇతర సామగ్రిని నిల్వ ఉంచిన ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాలసంఖ్య ఎక్కువగానే ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 2021లో 139, 2022లో 236, ఈ ఏడాది ఆగస్టు నాటికి 132 ప్రమాదాలు జరిగాయి. నాంపల్లి బజార్‌ఘాట్ ప్రమాదంతో పాటు.. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఒక్క రాజధాని ప్రాంతంలోనే ఐదు ఘోర దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఏకంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్ బోయిగూడలోని ఓ గోదాంలో గతేడాది మార్చిలో జరిగిన ప్రమాదంలో 11 మంది బిహారీ వలస కూలీలు అగ్నికి ఆహుతయ్యారు. సికింద్రాబాద్ రూబీ హోటల్(Ruby Hotel Fire Accident in Secunderabad) సెల్లార్లో గతేడాది సెప్టెంబరులో జరిగిన దుర్ఘటనలో 8 మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. సెల్లార్‌లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించింది.