తెలంగాణ

telangana

ETV Bharat / state

Special Grants to Telangana : కేంద్రంపై తెలంగాణ ఆశ.. నిధులు అందక నిరాశ - grants from central to telangana

Special Grants to Telangana : ప్రత్యేక గ్రాంట్లపై కేంద్ర ప్రభుత్వంపై ఆశలు పెంచుకున్న రాష్ట్రానికి ఏటా నిరాశే ఎదురవుతోంది. ఏటా అంచనాల్లోనే ప్రత్యేక గ్రాంట్లు నమోదవుతున్నాయి తప్ప.. తెలంగాణకు పథకాల నిధులు మినహా అదనం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను రూ.38,669 కోట్లుగా సర్కారు అంచనా వేయగా.. ఇప్పటివరకూ రూ. 7,303 కోట్లు మాత్రమే అందింది.

central grants to telangana
కేంద్రం నుంచి తెలంగాణకు గ్రాంట్లు

By

Published : Mar 14, 2022, 8:57 AM IST

Special Grants to Telangana : కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో ఆర్థిక తోడ్పాటును ఆశిస్తున్న రాష్ట్రానికి ఏటా నిరాశే ఎదురవుతోంది. రాష్ట్రం అంచనా వేసుకున్న మొత్తానికి, అందుతున్న నిధులకు పొంతన ఉండటంలేదు. ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన ప్రత్యేక నిధులూ అందడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో కేంద్ర ప్రత్యేక నిధుల కోసం ప్రతిపాదిస్తున్నా ఫలితం ఉండటంలేదు.

అంచనా తారుమారైంది

Special Grants to Telangana From Central : తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో ఒక ఏడాది అందిన గరిష్ఠ మొత్తం రూ.15,450 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరం వరకూ రెండుసార్లు మాత్రమే రూ.10 వేల కోట్లు.. అంతకంటే ఎక్కువ గ్రాంట్‌ రాష్ట్రానికి అందింది. ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను రూ.38,669 కోట్లుగా రాష్ట్ర సర్కారు అంచనా వేసింది. తాజాగా ఈ అంచనాలను రూ.28,669 కోట్లకు సవరించింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు కేంద్ర పథకాల ద్వారా గ్రాంట్ల రూపంలో అందించింది రూ.7,303 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.

బడ్జెట్​లో ప్రతిపాదించింది

Central Special Grants to Telangana : తాజాగా 2022-23 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.41,001 కోట్ల గ్రాంట్లు అందుతాయని అంచనా వేసింది. ఇందులో కేంద్ర పథకాల ద్వారా వచ్చే మొత్తం రూ.9,443 కోట్లుగా పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి రాకముందు కాలానికి సంబంధించి సీఎస్టీ పరిహారంగా రావాల్సినది రూ.3000 కోట్లుగా ప్రతిపాదించింది. వెనుకబడిన ప్రాంత అభివృద్ధి నిధులు (బీఆర్‌జీఎఫ్‌) రెండేళ్లకు రూ.900 కోట్లు రావాల్సి ఉందని తెలిపింది. మిషన్‌ భగీరథ సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం తెలంగాణకు ఆర్థిక తోడ్పాటు అందించాలన్న నీతి ఆయోగ్‌ సిఫారసు మేరకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ నిధులు రూ.25,555 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ అంచనాల్లో చూపించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పన్నుల వాటాగా రావాల్సిన మొత్తం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కలిపి రూ.59,396 కోట్లుగా రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇందులో పన్నుల వాటా రూ.18,394 కోట్లు, రూ.3003 కోట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధులుగా పేర్కొన్నారు. మరో రూ.9443 కోట్లు కేంద్ర ప్రభుత్వ పథకాలు, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ద్వారా పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల నిధులు. మిగిలిన నిధులను కేంద్రం అందించే ప్రత్యేక తోడ్పాటుగా విశ్లేషించారు.

ABOUT THE AUTHOR

...view details