Fever Survey: రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రారంభమైంది. వైద్యబృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను లక్షణాలు అడిగి తెలుసుకుంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నాయా అని ఆరా తీసి... వెంటనే మెడికల్ కిట్లు అందిస్తున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లో జరుగుతున్న ఫీవర్ సర్వేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పరిశీలించారు. జ్వరం లేదా ఇతర కొవిడ్ లక్షణాలు ఉంటే అక్కడిక్కడే మెడిసిన్ కిట్ అందిస్తున్నట్లు సోమేశ్‌కుమార్ చెప్పారు. వారంలో రాష్ట్రంలో ఫీవర్ సర్వే పూర్తిచేస్తామని స్పష్టంచేశారు.
ఒక వారం రోజుల్లో ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం. దీనివల్ల వ్యాక్సినేషన్ గురించి కూడా వివరాలు సేకరిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ ఫీవర్ సర్వేకు సహకరించాలి. కొవిడ్ లక్షణాలుంటే 5 రోజుల మందుల కిట్ అందజేస్తాం. కోటి మందుల కిట్‌లు సిద్ధంగా ఉంచాం. త్వరలో కేసులు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నాం. -సోమేశ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సర్వే వేగంగా చేయాలి..
Fever Survey in Telangana: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఫీవర్ సర్వేను హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. సర్వే వేగంగా చేయాలని ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 840 బృందాలు ఫీవర్ సర్వే చేస్తున్నాయని హైదరాబాద్ డీఎంహెచ్ఓ వెంకట్ వెల్లడించారు. ప్రతి బృందం రోజుకి 60 ఇళ్లను సర్వే చేస్తాయని చెప్పారు.