టోక్యో ఒలింపిక్స్ (TOKYO OLYMPICS)కు వెళ్లే క్రీడాకారులకు, కోచ్‌లకు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ (MINISTER SRINIVAS GOUD)సన్మానం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి బ్యాడ్మింటన్ స్టేడియం (GACHIBOWLI BADMINTON STADIUM)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుల్లెల గోపిచంద్, పి.వి. సింధు, సాయి ప్రణీత్, ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు. స్టేడియంలోని క్రీడాకారులతో సింధు బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహపరిచారు.
అనంతరం రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ (OLYMPICS)కు ఎంపికైన పి.వి.సింధు, సాయి ప్రణీత్‌ను సన్మానించారు. అదే సమయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. వేదికపైకి వెళ్లేందుకు క్రీడాకారులు, కోచ్‌లు నిరాకరించారు. కరోనా దృష్ట్యా వేదికపై ఎక్కువమంది ఉండటంతో వెనుకాడారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోక్యంతో క్రీడాకారులు వేదిక వద్దకు వెళ్లారు. మంత్రి వారికి సన్మానించి అభినందించారు.
''ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడాభివృద్దికి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నాం. క్రీడా పాలసీ తయారీకి క్రీడల అభివృద్ది మౌలిక సదుపాయాల కల్పన కోసం కేబినేట్ సబ్‌కమిటీని నియమించింది. మంగళవారం ఈ అంశంపై మంత్రి కేటీఆర్‌తో చర్చించాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు ఇప్పటివరకు రూ. 25కోట్ల 87లక్షల నగదు ప్రోత్సహకాలను అందించాం.
హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ.. భారతదేశానికే గొప్ప పేరు తెచ్చేట్లు ముందుకు పోవడం సంతోషించదగిన విషయం. ప్రజలు అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. చదువులోనూ, క్రీడల్లోనూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. క్రీడాకారులను, కోచ్‌లను ప్రోత్సహించేలా కృషి చేస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్‌లో ఆడి గెలిచి పతకాలు తెచ్చినవారికి గొప్పగా సన్మానం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. వారికి అన్నిరకాల సహాయ సహకారాలు అందేలా చూడాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ స్టేడియాలు నిర్మిస్తున్నాం. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్‌ను అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు రూ.100 కోట్లతో ప్రారంభించాం. హైదరాబాద్‌ను క్రీడా హబ్‌గా మార్చేలా కృషి చేస్తున్నాం.''