FedEx Courier Cyber Crimes in Telangana :సైబర్‌నేరగాళ్లు మోసాల్లో కొత్త ఎత్తుగడలకు తెగబడుతున్నారు. ఫెడెక్స్ కొరియర్ సంస్థ పార్శిల్ పేరుతో బురిడీ కొట్టించిన దోపిడీ బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఫోన్ కాల్ వచ్చింది. మీ పేరుపై ఫెడెక్స్ కొరియర్ ఉందని... ముంబై నుంచి తైవాన్ కు డెలివరీ అడ్రస్ ఉందని చెప్పారు. ఆశ్చర్యానికి గురైన మహిళ తాను ఎలాంటి పార్శిల్ పంపలేదని వారికి తెలిపింది. మీ ఫోన్ నంబర్‌తో పాటు ఆధార్ కార్డు వివరాలు కూడా నమోదై ఉన్నాయని...కావాలంటే మీ ఆధార్ కార్డును వాట్సప్ చేశామని ఆమెకు చెప్పారు. వాట్సాప్ సందేశాన్ని చూసిన మహిళ తన ఆధార్ కార్డును చూసి కంగారు పడింది. ఇంతలో ఫోన్ నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారికి ఇస్తున్నామని వారు తెలిపారు. పార్శిల్లో మాదకద్రవ్యాలు ఉన్నాయని...తైవాన్‌కు ఎందుకు పంపుతున్నారని ఆమెను ప్రశ్నించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని మహిళ తెలిపింది.
Cyber Crimes in the name of FedEx Courier in Telangana :సాయంత్రం మీ ఆధార్ అడ్రస్ ద్వారా మీ ఇంటికి తమ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పడంతో ఆ మహిళ కంగుతింది. కేసు కాకుండా ఉండాలంటే తాను ఏం చేయాలో చెప్పమని మహిళ వారిని అడగగా... తమ అధికారులతో మట్లాడి ఫోన్ చేస్తామని చెప్పి కట్ చేశారు. కొంత సేపటి తర్వత ఫోన్ చేసి రూ.5 లక్షలు కస్టమ్స్ వారికి, మరో రూ.5 లక్షలు నార్కొటిక్స్ విభాగానికి ఇవ్వాలని తెలిపారు. వెంటనే మహిళ వారు చెప్పిన ఖాతాలో జమచేసింది. అయినా కూడా మరికొంత డబ్బు కట్టాలని విడతల వారీగా మహిళను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.80లక్షలు గుంజారు. అనంతరం ఫోన్‌కు స్పందించలేదు. తన ఇంటికి ఏ పోలీసులు రాలేదు. ఇదంతా మోసమని గ్రహించిన మహిళ సైబర్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే తరహాలో బేగంపేటకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మోసపోయింది. సైబర్ నేరగాళ్లకు 5లక్షలు కట్టింది. మరో యువతి రూ.2.5 లక్షలు, మరో యువకుడు రూ.1.5 లక్షలు సమర్పించకున్నాడు. గత వారం రోజులుగా సైబర్ క్రైం పోలీసులకు ఇదే తరహాలో సుమారు 10 ఫిర్యాదులు అందాయి. మొత్తం కోటి రూపాయలకు పైగా సొమ్మును నేరగాళ్లు కాజేశారు.