తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం సేకరణలో ఎఫ్‌సీఐ ఆంక్షలు.. రాష్ట్రానికి వేలకోట్ల నష్టం - HYDERABAD NEWS

ధాన్యం కొనుగోలు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టాన్ని మిగిల్చే పరిస్థితి ఏర్పడింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ని ఒప్పించటంలో పౌరసరఫరాల శాఖ విఫలమవడంతో ఖజానాపై రూ. వేల కోట్ల భారం పడేలా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కలగజేసుకోని కేంద్రంతో మాట్లాడితేనే ఈ గండం నుంచి బయటపడోచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

FCI restrictions on grain procurement
ధాన్యం సేకరణలో ఎఫ్‌సీఐ ఆంక్షలు

By

Published : Sep 1, 2021, 9:10 AM IST

యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం 92.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దీంతో 62.81 లక్షల టన్నుల బియ్యం వస్తాయి. గత మే నెలలో ఎఫ్‌సీఐ తెలంగాణ రాష్ట్రానికి లేఖ రాసింది. 40శాతం ఉప్పుడు (బాయిల్డ్‌) బియ్యం, 60శాతం పచ్చి (రా) బియ్యం ఇవ్వాలని ఎఫ్‌సీఐ ఆ లేఖలో స్పష్టంగా తెలిపింది.

యాసంగిలో ఇక్కడ పండించే దాన్యం రకాల్లో అధికశాతం ఉప్పుడు బియ్యామే ఉంటాయి. తేమ శాతం ఎక్కువగా ఉండటంతో పచ్చి బియ్యంగా మారిస్తే నూకలు ఎక్కువై.. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకునే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితుల్లో 10నుంచి 20శాతం పచ్చి బియ్యం, 80నుంచి 90శాతం ఉప్పుడు బియ్యం ఇస్తామంటూ ఎఫ్‌సీఐకి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యుత్తరం రాసి చేతులు దులుపుకుంది.

కిం కర్తవ్యం?

ఎఫ్‌సీఐ 80 నుంచి 90 శాతం ఉప్పుడు బియ్యం తీసుకోకపోతే పౌరసరఫరాల సంస్థ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం కాయం. ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వ పూచీకత్తుపై సుమారు రూ. 20 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుంది పౌరసరఫరాల సంస్థ. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇస్తేనే ఆ డబ్బు తిరిగి వస్తుంది. ఎఫ్‌సీఐ కోరిన 40 శాతం కోసం 24.75 లక్షల టన్నుల బియ్యానికి 36.96 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. మిల్లర్లు ఇప్పటివరకు 25 శాతం ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్‌ చేశారు.

రూ. వేల కోట్ల నష్టం...

యాసంగిలో ధాన్యం కనీస మద్దతు ధరను కేంద్రం క్వింటాకు రూ. 1,888గా నిర్ణయించగా.. రవాణాఛార్జీలు, కొనుగోలు కేంద్రాలకు చెల్లించాల్సిన ఛార్జీలన్నీ కలిపి క్వింటాకు రూ. 2,100, బియ్యంగా మారిస్తే క్వింటాకు రూ. 3,100 వరకు వ్యయమవుతుందని అంచనా. ఎఫ్‌సీఐ 40 శాతం ఉప్పుడు బియ్యాన్నే తీసుకుంటే మిగిలిన 55.44 లక్షల టన్నుల ధాన్యాన్ని ఏం చేయాలన్నదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఎఫ్‌సీఐ నిర్ణయంతో రూ. వేల కోట్ల నష్టం వస్తుందని అంచనా. గత ఏడాది ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ధాన్యాన్ని బహిరంగ వేలంలో క్వింటాకు రూ. 1,400 చొప్పున విక్రయించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా అలాగే చేయల్సి ఉంటుంది.

కేంద్రాన్ని ఒప్పిస్తేనే...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకుంటే కానీ ఈ గడ్డు పరిస్థితి నుంచి పౌరసరఫరాల సంస్థ బయటపడే అవకాశం లేదు. కేసీఆర్‌ బుధవారం నుంచి మూడు రోజులపాటు దిల్లీలో ఉంటారు. పౌరసరఫరాల శాఖ మంత్రి, సంస్థ ఛైర్మన్‌, ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రి వెంట దిల్లీ వెళ్లి 80 నుంచి 90 శాతం ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు కేంద్రప్రభుత్వంతో చర్చించి ఒప్పించగలిగేతే ఈ గండం గట్టేక్కినట్లే.

ఇదీ చదవండి:అన్నకుటుంబంపై తమ్ముడు కత్తులతో దాడి.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details