రాష్ట్రంలో నాలుగు రోజులపాటు ఆర్థిక సంఘం పర్యటన ప్రముఖ ఆర్థిక వేత్త ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం నేడు రాష్ట్రానికి రానుంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పాటు మిషన్ భగీరథ పనులను సభ్యులు పరిశీలిస్తారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు నీటిపారుదల, మిషన్ కాకతీయపై కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వివరించనుంది.
ఈరోజు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్న ఆనకట్ట పనులను పరిశీలిస్తారు. జగిత్యాల జిల్లాలో ఉన్న ఆరో ప్యాకేజీని బృందం సందర్శిస్తుంది. ఆ తర్వాత సిరిసిల్ల వెళ్లి అక్కడ మిషన్ భగీరథ ప్రాజెక్టును పరిశీలిస్తారు. కమిషన్ ఛైర్మన్ ఎన్కే సింగ్ రేపు హైదరాబాద్ రానున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల, వివిధ వర్గాల అభిప్రాయాలను కమిషన్ సేకరించనుంది. 19న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆర్థిక సంఘం భేటీ కానుంది.
ఈ పర్యటనలో నగరంలోని చార్మినార్ సహా ప్రఖ్యాత ప్రాంతాలను కమిషన్ సందర్శిస్తుంది. 20న ఆర్థిక సంఘం బృందం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.