రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ అమలు అనుకున్నట్లుగా సాగడం లేదు. రాష్ట్రంలో 17 టోల్ ప్లాజాలలో డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ భావించినా.. ఇంకా వాహనదారుల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల గడువును జనవరి 15 వరకు పెంచారు. రాష్ట్రంలో చిల్లకల్లు, గూడూరు, ఇందల్వాయి, పంతంగి, కోరల్ పాడ్, రాయికల్, రోల్ మమ్దా, శాఖాపూర్, పిప్పల్వాడ, దిలావర్ పూర్, గంజల్, చింతపల్లి, పుల్లూరు, కోనేటిపురం, మనోహరాబాద్, భిక్నూర్, కడ్తాల్, ముతోజీపేట్ టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ 17 టోల్ ప్లాజాలను డిసెంబర్ 29 వరకు పరిశీలిస్తే.. 60.14 శాతం ఈ-చెల్లింపులు, 39.87 శాతం నగదు చెల్లింపులు జరిగాయి.
ప్రక్రియ | చెల్లింపులు (రూ.లలో) | శాతం |
ఫాస్టాగ్ | 1,85,76,000 | 58.91 |
ఈ చెల్లింపులు | 3,87,195 | 1.23 |
నగదు | 12,571,340 | 39.87 |
టోల్ ప్లాజాల మీదుగా వెళ్తున్న వాహనాల్లో 48శాతం ఫాస్టాగ్ లేన్ల నుంచి వెళితే.. 52శాతం నగదు లేన్ల నుంచి వెళ్తున్నాయి. ఫాస్టాగ్ లేన్ల ద్వారా టోల్ వసూలు ఎక్కువగా, వాహనాల రాక తక్కువగా ఉంది. క్యాష్ లేన్ల నుంచి వాహనాల సంఖ్య ఎక్కువగా, ఆదాయం తక్కువగా ఉంది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 29 వరకు 85,897 వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్‌లు కొనుగోలు చేశారు. 26న 1,499 ఫాస్టాగ్‌లు, 27న 1,530, 28న 1,743 ఫాస్టాగ్ లు, 29న 1,392 ఫాస్టాగ్‌ల అమ్మకాలు జరిగాయి. రోజుకు కొత్తగా సరాసరి సుమారు 1,300ల ఫాస్టాగ్ అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫాస్టాగ్ వల్ల టోల్ చెల్లించే సమయంలో క్యూలో ఉండాల్సిన సమస్య ఉండదని తెలిసినా.. వాహనదారుల్లో ఆశించిన ఫలితం కనిపించడంలేదు. వాణిజ్య వాహనాలు ఉన్నవారు ఎక్కువగా, సొంత వాహనాలు ఉన్నవారు తక్కువగా ట్యాగ్లు కొనుగోలు చేస్తున్నారు.