తెలంగాణ

telangana

ETV Bharat / state

Urea deficiency : అంచనాలు తలకిందులు.. యూరియాకు పెరిగిన డిమాండు - తెలంగాణ వ్యవసాయ వార్తలు

Urea deficiency : ప్రస్తుత యాసంగిలో యూరియాకు భారీగా డిమాండ్‌ పెరిగింది. తెలంగాణలో ఈ సీజన్‌కు ఎంత యూరియా అవసరమో వ్యవసాయశాఖ సరిగా అంచనా వేయలేకపోయింది. దీంతో రైతులు అధిక ధరలకు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సి వస్తోంది.

Urea
Urea

By

Published : Feb 27, 2022, 7:01 AM IST

Urea deficiency : రాష్ట్రంలో యూరియాకు డిమాండ్​ పెరిగింది. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రభావం కూడా యూరియా కొరతకు కారణమైంది. ఆ రాష్ట్రాల్లో పంటకు సరఫరా పెంచడంతో తెలంగాణకు ఇప్పటికే 88 వేల టన్నుల కోత పడింది. మరోవైపు ఈ సీజన్‌లో వరి వేయవద్దని ప్రభుత్వం చెప్పినా రైతులు యథావిధిగా సాగు చేశారు. అంటే సాధారణ విస్తీర్ణం 31 లక్షల ఎకరాలకన్నా.. 4 లక్షల ఎకరాలు ఎక్కువగా... అంటే 35 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. దీంతో యూరియా డిమాండు, వినియోగం పెరిగాయి. ఒక బస్తా ధర రూ.266 కాగా వ్యాపారులు రూ.300 నుంచి రూ.350 వరకు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

మార్క్‌ఫెడ్‌ వద్ద నిల్వలేవీ?

పంటల సాగుకు ఎరువుల కొరత రాకుండా 4 లక్షల టన్నుల యూరియా కొని ముందస్తు నిల్వలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ‘రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య’ (మార్క్‌ఫెడ్‌)కు ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఆదేశించింది. కానీ ఇప్పుడు సమాఖ్య వద్ద లక్ష టన్నులు కూడా లేవు. ఎరువుల కంపెనీలు మార్క్‌ఫెడ్‌కు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో నిల్వలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో 200కి పైగా ప్యాక్స్‌లో నిధులు లేకపోవడం, గతంలో తీసుకున్న ఎరువుల సొమ్ము తిరిగి సకాలంలో చెల్లించకపోవడంతో వాటికి యూరియా సరఫరాను మార్క్‌ఫెడ్‌ తగ్గించింది. దీంతో చిల్లర వ్యాపారుల వద్దనే కొనాల్సి వస్తోందని రైతులు చెప్పారు. సొమ్ము చెల్లించని సంఘాలకు యూరియా సరఫరా ఆపివేయాలని నిర్ణయించిన మాట వాస్తవమేనని మార్క్‌ఫెడ్‌ ఎండీ యాదిరెడ్డి చెప్పారు. సంఘాల్లో ఎరువులు లేకపోతే అదే గ్రామాల్లో కనీసం చిల్లర వ్యాపారుల వద్ద నిల్వలున్నాయా, వాటిని నిర్ణీత ఎమ్మార్పీలకే రైతులకు అమ్ముతున్నారా అనేది నిరంతరం పర్యవేక్షించాల్సిన జిల్లా వ్యవసాయాధికారులు(డీఏఓ) కొందరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల తాత్కాలిక కొరత ఏర్పడినట్లు సమాచారం. అన్ని జిల్లాలకూ సరఫరాను క్రమబద్ధీకరించి కొరత లేకుండా చూస్తున్నామని, ఆగ్రోస్‌ సేవా కేంద్రాల్లో నిల్వలు పెట్టి రైతులకు విక్రయిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ ఎరువుల విభాగం సంయుక్త సంచాలకుడు, ఆగ్రోస్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ కె.రాములు ‘ఈనాడు’కు చెప్పారు. రైతులెవ్వరూ ఎమ్మార్పీకన్నా ఎక్కువ చెల్లించవద్దని, ఎవరైనా వ్యాపారులు ఎక్కువ వసూలు చేస్తే బిల్లు తీసుకుని సమీపంలోని వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇదీ చూడండి :Pulse Polio 2022: నిండు జీవితానికి రెండు చుక్కలు.. నేడు పల్స్​ పోలియో కార్యక్రమం..

ABOUT THE AUTHOR

...view details