తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmers Day in Telangana Decade Celebrations : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 'రైతు దినోత్సవం' - దశాబ్ది ఉత్సవాల్లో రైతు దినోత్సవం

Telangana Farmer's Day in Decade Celebrations 2023 : రాష్ట్రంలో ఈ నెల 22 వరకు జరగనున్న దశాబ్ది ఉత్సవాలు నేడు రైతు దినోత్సవంతో ప్రారంభం కానున్నాయి. 9 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన విజయాలు, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్ఠతను తెలిపేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ ఏర్పాట్లు చేసింది.

Farmer's Day in TS Decade Celebrations
Farmer's Day in TS Decade Celebrations

By

Published : Jun 3, 2023, 8:26 AM IST

Telangana Formation Day Decade Celebrations 2023 :2014 జూన్‌ 2న అవతరించిన తెలంగాణ.. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ ఏట ఘనంగా అడుగుపెట్టింది. పదేళ్ల ప్రస్థానాన్ని చాటేలా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు శుక్రవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించి.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రగతి ప్రస్థానాన్ని కళ్లకు కట్టేలా వివరించారు. 21 రోజుల పాటు జరగనున్న ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రోజుకో రంగం చొప్పున వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఉత్సవాల్లో తొలి రోజైన నేడు రైతు దినోత్సవం జరపనున్నారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేశారు.

Farmers Day in Telangana Decade Celebrations : రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని క్లస్టర్ల పరిధిలోని కర్షకులతో సమావేశాలు నిర్వహిస్తారు. రైతుబంధు సమితుల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్‌ ఛైర్మన్లు, వ్యవసాయ, ఉద్యాన వన శాఖల మండల స్థాయి అధికారులు ఆ సమావేశంలో పాల్గొంటారు. 9 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన విజయాలు, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్ఠతను తెలిపేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటంతో పాటు కరపత్రాలు పంపిణీ చేస్తారు.

రైతులకు కలిగిన ప్రయోజనాలు, క్లస్టర్‌లోని గ్రామాలకు వ్యవసాయ శాఖ ద్వారా అందిన నిధుల గురించి సమావేశంలో వివరిస్తారు. రైతు బంధు, రైతు బీమా లబ్ధిదారులతో మాట్లాడించనున్నారు. సమావేశం అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు అన్నదాతలతో కలిసి సామూహిక భోజనాలు చేస్తారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Telangana Formation Day 2023 :ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభం కావడం గర్వకారణమని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత ఉంటుందని.. భవిష్యత్‌లోనూ ఈ రంగానికే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం వ్యవసాయం, రైతులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని దశాబ్ది ఉత్సవాల్లో వారికి తెలియజెప్పాలని మంత్రి అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ తరఫున జరిగే దశాబ్ది ఉత్సవాలు చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలంటే వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో అంకితభావంతో పని చేయాలని ఆదేశించారు. మార్కెట్ యార్డులను మామిడి తోరణాలు, విద్యుత్తు దీపాలతో అలంకరించి రైతులతో సమావేశాలు నిర్వహించాలని నిర్దేశించారు. ఇదిలా ఉండగా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details