ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి (Paddy Procurements Delay in Telangana) నానా కష్టాలు పడుతుండగా.. అకాల వర్షం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కేంద్రాలు ప్రారంభించినా కొన్నిచోట్ల కొనుగోలు నెమ్మదిగా (Paddy Procurements Delay in Telangana) సాగడం, మరికొన్నిచోట్ల మిల్లర్లు, ఐ.కె.పి. కేంద్రాల మధ్య సమన్వయం లేకపోవడం లాంటి సమస్యలతో వడ్లు కొనడంలో జాప్యం జరుగుతోందని రైతులు పేర్కొంటున్నారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం, రంగుమారిన ధాన్యాన్ని మళ్లీ కడగడం.. ఇలా పలు సమస్యలను ఎదుర్కొంటున్నామని అంటున్నారు. కొన్నిచోట్ల ధాన్యం తేమగా ఉందని, కొని ఆరబెట్టిన తర్వాత తగ్గుతుంది కాబట్టి బస్తాకు రెండు కిలోలు ఎక్కువగా ఉండాలని మిల్లర్లు అడుగుతున్నారని వాపోతున్నారు. మరోవైపు కొందరు రైతులు పొలాల్లో ఉన్న పంటను కోయడానికీ ఇబ్బంది పడుతున్నారు. వర్షాలతో చేలల్లో నీళ్లుండటమే కాదు.. పంట నేలకొరిగింది. ఎక్కువ రోజులు అలాగే ఉంటే మరింత నష్టం కలుగుతుందని కాటారానికి చెందిన చీర్ల తిరుపతి వాపోయారు. కొన్నిచోట్ల ధాన్యం తూకాలేసినా వెంటనే తరలించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పురుగు మందుల డబ్బాలతో రాస్తారోకో
తడిసిన ధాన్యాన్ని కొనాలంటూ (Paddy Procurements Delay in Telangana) పురుగు మందుల డబ్బాలతో కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామ రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. కామారెడ్డి-రాజన్న సిరిసిల్ల రోడ్డుపై బైఠాయించారు. కాంటా పూర్తయి లారీల్లో నింపిన బస్తాలు వర్షానికి తడిస్తే వెనక్కు పంపుతున్నారని వాపోయారు. ఈ సందర్భంగా ఓ రైతు పురుగుల మందు తాగేందుకు యత్నించగా తోటి రైతులు అడ్డుకున్నారు. తహసీల్దారు శ్రీనివాస్‌రావు, డీఎస్పీ సోమనాథం ఘటనా స్థలానికి చేరుకొని ధాన్యాన్ని గ్రామ పరిధిలోని రైస్‌మిల్లులకు తరలించడంతోపాటు తడిసిన వడ్లను బాయిలర్ మిల్లులకు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఆవేదనతో ఆత్మహత్యాయత్నం
ధాన్యం తూకం వేయడానికి కొనుగోలు కేంద్రంలో సిబ్బంది జాప్యం చేస్తున్నారంటూ సంగారెడ్డి జిల్లా కల్హేర్‌కు చెందిన గుడిపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని చెట్టుకు ఉరేసుకునేందుకు యత్నించారు. చుట్టుపక్కలవారు గమనించి అడ్డుకున్నారు. అనంతరం బాధిత రైతు ధాన్యాన్ని అధికారులు తూకం వేయించారు.
పది ఎకరాల్లో వరి వేశాను. పంట కోసి ఇరవై రోజులైంది. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి రెండు వారాలైనా ఇంకా కొనలేదు. అకస్మాత్తుగా వర్షం రావడంతో ధాన్యం తడిసింది. దీన్ని ఆరబెట్టడానికి అదనంగా ఖర్చు. ధాన్యం నల్లగా ఉంటే కొనరని ట్రాక్టర్‌లో పోసి మళ్లీ శుభ్రం చేశాం. మరోవైపు వర్షానికి తడిసి మొలకెత్తుతున్నాయి.
- గంగాధర సుదర్శన్, మధురానగర్, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా
వడ్లన్నీ తడిచిపోయాయి..
పదెకరాల్లో వరి సాగు చేశా. ఇరవై రోజుల కిందట కోయించి ఆరబెట్టి ఊర్లో ఖాళీ స్థలంలో కుప్ప పోశాం. కొనుగోలు కేంద్రంలో నా టోకెన్ నంబరు వచ్చేలోపు వర్షం కురిసింది. ఇరవై ట్రాక్టర్ల వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. వీటిని మరోచోటకు తరలించి ఆరబెట్టాల్సి వచ్చింది. ఎత్తటానికి కూలీలకు, తరలించటానికి ట్రాక్టర్ ఛార్జీలు కలిపి రూ.10 వేలు అదనపు ఖర్చు వచ్చింది. బి-గ్రేడ్ కింద తూకం వేస్తామని చెబుతున్నారు. అధికారులు స్పందించి ఏ-గ్రేడు కింద తీసుకోవాలి.