కొనుగోలు సరే.. వసతులేవీ? - Purchasing Centers in Telangana
కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సన్న ధాన్యం శుభ్రపరిచే యంత్రాల ఏర్పాటులోనూ జాప్యం నెలకొంటుంది.
కొనుగోలు సరే.. వసతులేవీ?
By
Published : Nov 14, 2020, 8:43 AM IST
సన్న వరిధాన్యం కొనుగోలుకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో జరుగుతున్న జాప్యం రైతులకు నష్టాలను మిగుల్చుతోంది. ధాన్యాన్ని ప్రభుత్వం తరఫున మద్దతుధరకు కొంటున్న మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద సరైన సౌకర్యాలు లేవు. ధాన్యంలో తాలు, మట్టి, ఇతర వ్యర్థాలుండటం వల్ల నాణ్యత లేదని మద్దతు ధర ఇవ్వడం లేదు. వీటిని తొలగించేందుకు ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు(ప్యాడీ క్లీనర్లు) కొని ఇవ్వాలని ఈ సంఘాలు నెలక్రితమే మార్కెటింగ్ శాఖను కోరాయి. ధాన్యం కొనుగోలు అంతా పౌరసరఫరాల శాఖ చూస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత మాత్రం మార్కెటింగ్‌శాఖకు అప్పగించారు. గతేడాది వరకూ కొన్న యంత్రాలు 3030 ఉన్నా అవి సరిపోవని, ఈ సీజన్‌కు మరో 910 కావాలని ఈ సంఘాలు విన్నవించాయి. వాటిని పంజాబ్ నుంచి కొనే తెప్పించే బాధ్యతను ‘రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కేంద్రం’(ఆగ్రోస్)కు మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. ఇప్పటివరకూ 746 యంత్రాలు మాత్రమే వచ్చాయి. తేమ కొలిచే యంత్రాలు 1084 తెప్పించమంటే ఇంకా 240 రానేలేదు. ధాన్యం తూకం వేసే యంత్రాలు 1302 కొనమంటే ఇంకా 129 రాలేదు.
ఎందుకీ నాణ్యత లేమి?
భారీవర్షాలు, తెగుళ్ల వల్ల వరిపైరు నేలవాలడంతో యంత్రాలతో కోసే సమయంలో మట్టితో కూడిన తాలు ధాన్యం వస్తోంది. ప్యాడీ క్లీనర్ల కొరత వల్ల రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చాక తాలు, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు కూలీలతో మళ్లీ తూర్పారబోయిస్తున్నారు. ఫలితంగా వారికి అదనంగా ఖర్చవుతోంది. కొనుగోలు కేంద్రాలకు ఈ యంత్రాలతో పాటు, ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రాల(డ్రైయర్ల)ను ఇస్తే రైతులకు ఎంతో ఉపయోగపడేవి. ఇప్పటివరకూ 6408 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి కొంటున్నారు. మొత్తం 6564 కేంద్రాలు తెరవాలనేది లక్ష్యం. ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాలు 4000 లోపే ఉండటం గమనార్హం. మరోవైపు డ్రైయర్లను కొనటానికి అనుమతీ ఇవ్వలేదు.
యంత్రాలతో కోయించి.. రోడ్లపై ఆరబోసి...
ప్రతీ కొనుగోలు కేంద్రంలో డ్రైయర్ ఒక్కోటైనా ఏర్పాటుచేస్తే ధాన్యం ఆరబెట్టి తేమలేకుండా చూడటం రైతులకు సులువయ్యేది. కూలీలు దొరకక బురదపొలాల్లో యంత్రాలతో వరిపంటను కోయిస్తున్నారు. ఇలా వచ్చే ధాన్యంలో తేమ 30 నుంచి 40 శాతం వరకూ ఉంటోంది. నిబంధనల ప్రకారం 14 శాతంలోపు తేమ ఉంటేనే మద్దతు ధర ఇస్తారు. కానీ ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న ధాన్యంలో తేమ అధికంగా ఉంటోందని చాలావరకూ మద్దతు ధర ఇవ్వడం లేదు. తేమ లేకుండా ఆరబెట్టేందుకు తారు రోడ్లపై ధాన్యాన్ని రైతులు ఆరబోస్తున్నారు. మార్కెట్‌లో ధాన్యాన్ని కొద్దిసేపటిలో ఆరబెట్టే ఆధునాతన యంత్రాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయని, వాటిని మార్కెటింగ్ లేదా పౌరసరఫరాల శాఖ అన్ని కేంద్రాలకు సమకూరిస్తే రైతులకు మేలు జరిగేదని సీనియర్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. ఈ సీజన్ నుంచి మార్కెటింగ్ శాఖ కూడా తొలిసారి కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్లలోనే ఏర్పాటుచేసి ధాన్యాన్ని కొంటోంది. ఈ శాఖ కేంద్రాల్లో సైతం డ్రైయర్లు లేవు. దీనిపై మార్కెటింగ్ సంచాలకురాలు లక్ష్మీబాయిని వివరణ అడగ్గా 910 ప్యాడీ క్లీనర్లు కావాలని పౌరసరఫరాలశాఖ కోరగా తెప్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.