తెలంగాణ

telangana

ETV Bharat / state

family washed away in the flood : తిరిగిరారు తనవాళ్లు.. తలచుకుంటే కన్నీళ్లు - తెలంగాణ వరదలు

ఒకరా..ఇద్దరా ఏకంగా ఎనిమిది మంది కుటుంబ సభ్యుల్ని ఓ కాళరాత్రి కమ్మేసింది. ఆ కుటుంబ పెద్దకు కడుపు కోత మిగిల్చింది. ఇప్పటికీ దొరకని మృతదేహాల కోసం ఆ హృదయం తల్లడిల్లుతూనే ఉంది. వరదలో కొట్టుకుపోతూ మృత్యుంజయుడిగా నిలిచిన ఆయన.. ‘నన్నెందుకు బతికించావు భగవంతుడా’ అంటూ రేయింబవళ్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని అలీనగర్‌ ప్యాలెస్‌వ్యూ కాలనీకి చెందిన మహమ్మద్‌ తాహేర్‌ ఖురేషీ(62) కుటుంబంలో గత ఏడాది అక్టోబరు 14న జరిగిన విషాదమిది. అప్పట్లో మహానగరాన్ని కుదిపేసిన వరద తాలూకూ విలయంలో ఇద్దరు కుమారులు, ముగ్గురు కోడళ్లు, మనవడు, మనవరాలు, సోదరుడిని కళ్లముందే కోల్పోయానంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

family washed away in the flood
మహమ్మద్‌ తాహేర్‌ ఖురేషీ

By

Published : Oct 14, 2021, 6:44 AM IST

‘‘అక్టోబరు 11న జరిగిన మనవడి పుట్టిన రోజే నా జీవితంలో చివరి సంతోషకరమైన రోజవుతుందని ఊహించలేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సమీపంలోని నాలా పొంగుతోంది. 13వ తేదీ రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఎటుచూసినా చీకటి. నేల ఏదో.. నీళ్లు ఏవో తెలియని స్థితి. చుట్టుపక్కల ఇళ్ల గోడలు కూలిపోతున్న శబ్దాలు విన్పిస్తున్నాయి. మా గోడలు కూడా కూలిపోతాయేమోనని భయపడ్డాం. పక్కనే ఉన్న మా తమ్ముడి ఇంటికెళ్తే అందరం సురక్షితంగా ఉండొచ్చని అనుకున్నాం. మొదటిగా నేను, నా పెద్ద కుమారుడు అబ్దుల్‌ వాసీ, కోడలు దరాక్షా, మనవరాలు అమీనా, రెండో కొడుకు అబ్దుల్‌వాజీద్‌, ఆయన భార్య ఫర్జానా తబుస్సం, మనవడు అబ్దుల్‌ వాహెబ్‌, మూడో కోడలు ఫర్జానా ఒమెరా ఇంటి నుంచి బయటకొచ్చాం. ఒకరి చేతులు ఒకరం పట్టుకుని నాలుగడుగులు వేశామో.. లేదో? ఒక్కసారిగా నీళ్లు అందర్నీ వెనక్కు తోసేశాయి. కొట్టుకుపోయాం. కాపాడేందుకు మా తమ్ముడు అబ్దుల్‌ ఖుద్దూస్‌ ఖురేషీ ముందుకురాగా.. అతడినీ ప్రవాహం చుట్టేసింది. తర్వాత ఏమైందో తెలియలేదు. చిన్న కొమ్మలాంటి ఆధారం దొరికితే పట్టుకున్నా. ఉదయం ఆరుగంటల ప్రాంతంలో అతికష్టమ్మీద నీళ్లలోంచి బయటికిరావడానికి ప్రయత్నించా. నా ఒంటి మీద దుస్తుల్లేవు. శరీరమంతా గాయాలు. అక్కడే ఉన్న గోనెపట్ట కట్టుకుని ఒడ్డుకు చేరా. మా ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఫలక్‌నుమా ప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకున్నా. ఏడుగురు కుటుంబ సభ్యులు, తమ్ముడు కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. నా భార్య, ఇద్దరు మనవళ్లు, మరో కొడుకు ఇంట్లో క్షేమంగా ఉన్నట్టు చెప్పారు. 14వ తేదీనే ముగ్గురు కోడళ్లు, మననవరాలి మృతదేహాలు దొరికాయి. 16న తమ్ముడి భౌతికకాయం కనిపించింది. అదే నెల 26వ తేదీ నల్గొండ జిల్లా శాలిగౌరారం వద్ద మూసీలో పెద్ద కుమారుడి శవం లభ్యమైంది. మరో కుమారుడు, మనవడి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. మూసీ నది సమీపంలోని 32 పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశా. ఎక్కడ అనాథ శవం ఉందంటే.. అక్కడికి వెళ్లా. ఇంకా వెళ్తూనే ఉన్నా. ఇటీవలే అవి దొరకలేదని తేల్చిన పోలీసులు తుది నివేదిక ఇచ్చేశారు. నేను మాత్రం వారి కోసం ఎదురుచూస్తూనే ఉంటా’’ అంటూ ఖురేషీ రోదించారు.

పరిహారం రాలేదు..రెండు పడక గదుల ఇల్లూ ఇవ్వలేదు

ఫలక్‌నుమా డిపోలో డ్రైవర్‌గా పనిచేసిన ఖురేషీ అనారోగ్యంతో 2016లో పదవీ విరమణ తీసుకున్నారు. ప్రస్తుతం నెలకు రూ.1600 పింఛనుతో జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం అనారోగ్యంతో ఆయన భార్య చనిపోయారు. తల్లిదండ్రులులేని ఇద్దరు మనవళ్ల బాధ్యతను తానే తీసుకున్నారు. ‘‘తనకు, తన సోదరుడి కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లు, మరణించిన ఒక్కొక్కరికీ రూ.5 లక్షల పరిహారం ఇస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారు. నేటికీ నెరవేరలేదు. అనేకసార్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లా. ప్రభుత్వం అండగా నిలుస్తుందనే ఆశతో ఉన్నా’’ అని ఖురేషీ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details