గోదావరిపై ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల ఉంది. నదికి వరద వచ్చే కాలంలో రోజుకు 8,500 క్యూసెక్కుల చొప్పున 80 టీఎంసీలకు పైగా ప్రకాశం బ్యారేజికి మళ్లించవచ్చు. అయితే... దాదాపుగా పట్టిసీమ పరిధిలోని ప్రాంతాలకే రబీ కాలంలో నీటిని ఎత్తిపోసేందుకు మరో కొత్త పథకం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగేయడం చర్చనీయాంశంగా మారింది. పోలవరం జలాశయంపై రూ.912.84 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గుత్తేదారును ఖరారు చేశారు. మరోవైపు రూ.వందల కోట్ల ఖర్చు అవసరం లేకుండానే కొత్త పథకం లక్ష్యాలను అన్నింటినీ... పట్టిసీమతోనే సాధించవచ్చని జలవనరుల శాఖ నిపుణులు సూచిస్తున్నారు.
పట్టిసీమ నిర్మాణ సమయంలో... ప్రతిపక్షంలో ఉన్న వైకాపా పలు విమర్శలు చేసింది. దాంతో గోదావరి డెల్టా అవసరాలకు ఇబ్బంది కలగకుండా పట్టిసీమ వద్ద +14 మీటర్ల స్థాయి నుంచే, అదికూడా సముద్రంలోకి వరద వృధాగా వెళ్లే సందర్భంలో మాత్రమే నీటిని ఎత్తిపోస్తామని నాటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. అదే వైకాపా... అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఏకంగా పోలవరం జలాశయంలోని డెడ్ స్టోరేజి నీటిని ఎత్తిపోసేందుకు కొత్త పథకానికి రూపకల్పన చేసింది. దీని నిర్మాణానికి ప్రభుత్వం ఈఏడాది ఏప్రిల్‌లోనే పాలనామోదం ఇచ్చింది. ‘‘గోదావరిలో వరద ప్రవాహాలు తగ్గిపోయిన తర్వాత పోలవరం జలాశయంలో +35.50 మీటర్ల కాంటూరు స్థాయి నుంచి +32.00 కాంటూరు మధ్య ఉన్న నీటిని ఎత్తిపోస్తారు. అదీ రబీ పంట కాలంలో జనవరి-ఏప్రిల్ నెలల మధ్య పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని కరవు ప్రాంతాల అవసరాలకు రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని తీసుకువెళ్లేందుకు ఈ ఎత్తిపోతల నిర్మిస్తున్నాం’’ అని జీవోలో పేర్కొన్నారు.
స్లూయిస్ గేట్లను ఉపయోగించొచ్చు
పోలవరంలో వరద లేని సమయంలోనూ రివర్ స్లూయిస్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదలవచ్చు. ప్రాజెక్టు విద్యుత్కేంద్రంలో ఉత్పత్తికి అనువుగా వీటిని ఏర్పాటు చేశారు. పది రివర్ స్లూయిస్ గేట్ల ద్వారా +25.72 మీటర్ల క్రస్టు లెవల్ వద్ద 21,561.57 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలవచ్చని అధికారులు లెక్కించారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు డెడ్‌స్టోరేజి నీటిని వాడుకోవాలని అనుకుంటే... గోదావరి డెల్టా రబీ అవసరాలను సమన్వయం చేసుకుంటూనే పట్టిసీమ నుంచి తాగునీటికి అవసరమైన నీటిని మళ్లించవచ్చని నిపుణుల సూచన.
కొందరు విశ్రాంత ఇంజినీర్లు ఏమంటున్నారంటే...
పట్టిసీమ వద్ద గోదావరి బ్యారేజి గరిష్ఠ నీటిమట్టం +13.6 మీటర్లు. రబీలో +13.9 మీటర్ల వరకు కూడా నీటిని ఆపుతుంటారు. అంటే దాదాపు +14 మీటర్ల స్థాయిలో నీరు వృధా కాకుండానే నిలబెట్టవచ్చు. ఆ సమయంలో పట్టిసీమ నుంచి నీటిని సులభంగా ఎత్తిపోయవచ్చు. ఇదంత కష్టం కాదు. - పట్టిసీమ పర్యవేక్షణతోపాటు పోలవరం పనుల్లో అనుభవమున్న ఓ విశ్రాంత ఎస్‌ఈ