తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​కు 3 రాజధానులు.. 4 కమిషనరేట్లు

ఆంధ్రప్రదేశ్​లో 3 రాజధానుల ఏర్పాటుకు నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అమరావతి, విశాఖ, కర్నూలు కేంద్రంగా... రాజధానుల ఏర్పాటుకు సూచించింది. పాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాలను 4 ప్రాంతీయ కమిషనరేట్లుగా విభజించాలని పేర్కొంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఆకాంక్షలు, భౌగోళిక పరిస్థితులు, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని సిఫార్సులు చేసినట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని వివరించింది.

expert-committee-submit-report-to-cm-jagan
ఆంధ్రప్రదేశ్​కు 3 రాజధానులు.. 4 కమిషరేట్లు

By

Published : Dec 21, 2019, 10:55 AM IST

ఆంధ్రప్రదేశ్​లో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యమంటూ... జీఎన్​ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ 3 రాజధానుల ఏర్పాటుకు సిఫారసు చేసింది. అమరావతిలో చట్టసభలు, విశాఖలో పాలన, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్‌లో సచివాలయంతోపాటు సీఎం క్యాంపు కార్యాలయం, అసెంబ్లీ వేసవికాల సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చెప్పింది. విశాఖతో పాటు అమరావతిలో హైకోర్టు బెంచ్‌లు నెలకొల్పాలని నివేదికలో పేర్కొంది.

అసెంబ్లీ, మంత్రుల నివాసాలు, గవర్నర్‌ నివాసం ఉండే రాజ్​భవన్ అమరావతిలో ఉండాలని నివేదించింది. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టుతో పాటు అనుబంధ కోర్టులు ఏర్పాటుకు సిఫారసు చేసినట్లు తెలిపింది. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణ అంశాలనూ నివేదికలో పొందుపరిచినట్లు కమిటీ వెల్లడించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సవివర నివేదిక అందించింది.

అమరావతి ప్రాంతంలో వరద ముంపు సమస్య ఉందని... అందువల్ల పూర్తిస్థాయి రాజధాని వద్దని సూచించామని కమిటీకి నేతృత్వం వహించిన జీఎన్ రావు వెల్లడించారు. అమరావతిలో ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను పూర్తిచేసి వాడుకోవాలని చెప్పినట్లు వివరించారు. నాగార్జున వర్సిటీ, ఏపీఎస్పీ బెటాలియన్‌ భూములు ఉన్నచోట శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టవచ్చన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరకోస్తా, రాయలసీమ అభివృద్ధికి సూచనలు చేశామని, ఆ దిశలోనే రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ ఉండాలని తెలియజేశామన్నారు.

కర్ణాటక తరహాలో ప్రాంతీయ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. 13 జిల్లాలను 4 ప్రాంతీయ కమిషనరేట్లుగా విభజించడం వల్ల... పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని అభిప్రాయపడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో ఉత్తర కోస్తా రీజియన్, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో సెంట్రల్‌ కోస్తా రీజియన్‌... గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో దక్షిణకోస్తా రీజియన్‌, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను రాయలసీమ రీజియన్‌గా విభజించి... కమిషనరేట్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందని కమిటీ అభిప్రాయపడింది.

సుదీర్ఘ తీరప్రాంత అభివృద్ధితో పాటు... గోదావరి, వంశధార, నాగావళి, మహేంద్రతనయ, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయాలని... ఈ ప్రక్రియలో కాలువలను తీర్చిదిద్దాలని పేర్కొంది. విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా... ప్రభుత్వమే సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసి సరఫరా చేయాలని చెప్పింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 10వేల 600 కిలోమీటర్ల మేర పర్యటించి... అధికారులు, వివిధ వర్గాల ప్రజలను కలిసి నివేదిక రూపొందించినట్టు కమిటీ వెల్లడించింది. మొత్తం 38 వేల వినతులు స్వీకరించగా... అందులో రాజధాని రైతులవే 2వేల వరకు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇక్కడి రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారని, అదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించామని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్​కు 3 రాజధానులు.. 4 కమిషనరేట్లు

ఇదీ చూడండి : 'వాడివేడిగా ఐటీడీఏ సమావేశం... సమస్యలు మేం పరిష్కరిస్తాం'

ABOUT THE AUTHOR

...view details