Expenditure of Pending Irrigation Projects in Telangana :తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను (Irrigation Projects) పూర్తి చేయడానికి మరో రూ.58,000 కోట్లు అవసరమని నీటిపారుదల శాఖ నివేదించింది. ఇంకా 38,000ల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని తెలిపింది. 2014-15 నుంచి వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1.80 లక్షలు కోట్లు ఖర్చయిందని పేర్కొంది. ఇందులో రూ.98,400 కోట్లు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వం రుణంగా తీసుకుందని వెల్లడించింది.
నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం సాగునీటి రంగంపై ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు, చీఫ్ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఇచ్చిన ప్రజంటేషన్‌లో ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం పలు దశల్లో ఉందని మంత్రి ఉత్తమ్‌కు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 11 ప్రాజెక్టుల్లో 75 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఇందులో 2004లో జలయజ్ఞంలో భాగంగా చేపట్టినవి 10 ఉండగా, కొత్తగా చేపట్టిన వాటిలో కాళేశ్వరం ఎత్తిపోతల ఉందని పేర్కొన్నారు. ఇవి పూర్తి కావడానికి రూ.25,000ల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు చెప్పారు. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికే రూ.17,852 కోట్లు అవసరమని వివరించారు.
Telangana Budget 2023-24 : తెలంగాణ బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకే పెద్దపీట
- ఈ 11 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 29,500 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. కాళేశ్వరానికే 17,192 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని తెలిపారు. ఇందులో ఎక్కువభాగం కాలువల నిర్మాణానికి వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు.
- కాళేశ్వరం ఎత్తిపోతల పథకం(Kaleshwaram Project) కింద ఇప్పటివరకు 1,62,000 ల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించామని అన్నారు. మరో 16.64 లక్షల ఎకరాలకు కల్పించాల్సి ఉందని తెలిపారు. ఖర్చు 85 శాతం వరకు పూర్తయినా, ఆయకట్టు మాత్రం అందుకు తగ్గట్లుగా అందుబాటులోకి రాలేదని వెల్లడించారు.
- 50 నుంచి 75 శాతం వరకు పనులు పూర్తయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయని చెప్పారు. అవి పూర్తయ్యేందుకు రూ.27,546 కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఇందులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.22,856 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ.3,638 కోట్లు అవసరమని వివరించారు. 50 శాతంలోపు పనులు జరిగిన మూడు ప్రాజెక్టులకు రూ.6,000ల కోట్లు అవసరం కాగా, ఇందులో డిండి ఎత్తిపోతల, సీతమ్మసాగర్ ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తెలిపారు.