Subscription System For Future Houses: ఇళ్ల నిర్మాణంలో 75 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నేలను తాకేలా ఉండే పూరిళ్లు మొదలు.. ఇప్పుడేమో ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా ఆకాశహర్మ్యాల కాంక్రీట్ నిర్మాణాల వరకు ఎన్నెన్నో మార్పులు.. ఇవన్నీ నిర్మాణపరంగా వచ్చినవి. అయినా ఇప్పటికీ సొంతిల్లు ఎంతోమందికి తీరని కలగానే ఉంది. ఈ స్వప్నం నెరవేర్చుకునేందుకు జీవితకాలంగా కష్టపడుతున్నవారు ఉన్నారు.
మరోవైపు కొందరేమో ఐదారేళ్లకు ఒక సొంతిల్లు మారుస్తున్నారు. వచ్చే రెండున్నర దశాబ్దాల్లో ఇదే పెద్ద పోకడ కాబోతుందని.. మున్ముందు ఇళ్లు కొనడం ఉండకపోవచ్చని.. సబ్‌స్క్రిప్షన్ విధానం వచ్చే అవకాశం ఉందని స్థిరాస్తి రంగంలోని యువ డెవలపర్లు అంటున్నారు.
తరం మారుతోంది.. సొంతింటిపై ఆలోచనలూ మారుతున్నాయి. ఒకప్పుడు సొంతింట్లో రెండు మూడు తరాలు నివసించేవారు. కొంతకాలానికి అదికాస్తా ఒక తరానికి తగ్గింది. ప్రస్తుతం చూస్తే ఒక తరం సైతం పూర్తిగా ఉండటం లేదు. పది, పదిహేనేళ్లు కాగానే పాత ఇంటిని అమ్మేసి కొత్త ఇంటికి మారిపోతున్నారు. పెరిగిన కుటుంబ అవసరాలు, ఆర్థిక స్థోమత కారణమేదైతేనేం మార్పును కోరుకుంటున్నారు.
ఇప్పటితరం మరింత వేగంగా ఆలోచిస్తోంది. ముఖ్యంగా 2000 తర్వాత పుట్టిన మిలీనియన్లు ఐదారేళ్లలో ఇళ్లు మార్చేస్తున్నారు. కొందరైతే రెండు మూడు ఇళ్లు మారిన ఉదంతాలు కూడా నగరంలో ఉన్నాయి. సొంతిల్లు లేనన్ని రోజులు దానికోసమే తపన. ఇల్లు కొనగానే రెండు మూడేళ్లలో ఆ ముచ్చట కాస్తా తీరగానే మరో ఇంటికో, మరో చోటుకో వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో ఎక్కువగా ఇది కనబడుతోంది.
ఏంటీ విధానం?
ఇప్పటివరకు ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. నివాసంతో పాటూ పెట్టుబడిగానూ చూస్తున్నారు. ఇతర అన్ని పెట్టుబడి సాధనాలతో పోలిస్తే అత్యధిక రాబడి రియల్ ఎస్టేట్‌లోనే వస్తోంది. దీంతో ఇదివరకే ఇళ్లు ఉన్నప్పటికీ రెండు మూడు కొనేవాళ్లు ఉన్నారు. అద్దెలూ వస్తాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కాబట్టి మరో దశాబ్దం వరకు స్థిరాస్తుల ధరలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా పెరగడం, పట్టణీకరణ, వలసలతో ఇళ్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఇంకా కొంత కాలం ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో సబ్‌స్క్రిప్షన్ విధానం తెరపైకి వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలను ఉటంకిస్తూ బిల్డర్లు అంచనా వేస్తున్నారు.
రాబోయే పాతికేళ్లలో ఇప్పటిలాగా ఇళ్లు కొనకుండానే సొంతం చేసుకోవచ్చు. దీన్నే సబ్‌స్క్రిప్షన్ మోడల్ అంటున్నారు. కొవిడ్ ముందు కార్ల విక్రయాలు తగ్గిన సమయంలో మారుతి కంపెనీ సబ్‌స్క్రిప్షన్ విధానం కొత్తగా తీసుకొచ్చింది. కారు అవసరం ఉన్న వ్యక్తులు కొనాల్సిన అవసరం లేకుండా ప్రతినెలా చందా చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. నిర్ణీత కాలాన్ని ఎంచుకుని చందా చెల్లించినంత కాలం ఆ కారుకు మీరే యాజమాని.