లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇదే అదనుగా తమ వద్ద ఉన్న నిల్వలను గుట్టుచప్పడు కాకుండా అధిక ధరలకు అమ్మి కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా నుంచి బయటపడిన వారిలో ఎక్కువ మంది తిరిగి తయారీ మొదలు పెట్టినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.
మార్చి 22 నుంచి ఏప్రిల్ 21వ వరకు సుమారు 2,093 కేసులు నమోదు చేసిన అధికారులు.. 1978 మందిని అరెస్టు చేశారు. ఆరు వేల లీటర్లకుపైగా లిక్కర్, నాలుగున్నర వేల లీటర్లు బీరు, 5,300 లీటర్లు గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. 82 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. విక్రయాలకు పాల్పడిన వారిపై 656 కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అందులో ఎక్కువ కేసులు వరంగల్, నల్గొండ ఎక్సైజ్ డివిజన్లలో ఉన్నాయి. గుడుంబా తయారీపై 1,182 కేసులు నమోదవ్వగా.. 1,071 మందిని అరెస్టు చేశారు. అందులో ఎక్కువ వరంగల్‌లో 328, మహబూబ్‌నగర్‌లో 221, కరీంనగర్ ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో 172 చొప్పున కేసులు నమోదయ్యాయి. వరుసగా 269, 240, 104 మందిని అరెస్ట్ చేశారు.